
మీ అవగాహనే బ్రహ్మాస్త్రం
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025
వినియోగదారుల హక్కుల కోసం పోరు
గతంలో జిల్లా వినియోగదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆకివీడుకు చెందిన బొబ్బిలి బంగారయ్య మోసపోయిన వినియోగదారులతో కోర్టులో కేసులు వేయించి అనేక విజయాలు సాధించారు. ఆకివీడులో 1989 సెప్టెంబర్ 9న ఆయన వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఎంతో మందికి వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కల్పించమేగాక జిల్లా వ్యాప్తంగా ఎన్నో సంఘాల్ని ఏర్పాటు చేయించారు. 20 ఏళ్ల క్రితం టెలిఫోన్ బిల్లుల పెంపుపై పోరాటం చేసి రెంటల్‌ను రూ.180 నుంచి రూ.110కు తగ్గించేలా చేయించారు. వంట గ్యాస్ కోసం క్యూ విధానానికి స్వస్తి చెప్పి బుకింగ్ విధానం అమలు చేయించగలిగారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న పంటలకు పంటల బీమా వర్తించకపోవడంతో పోరాటం చేసి ఆకివీడు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోని 700 మంది రైతులకు దాదాపు రూ.3 కోట్ల నష్టపరిహారం ఇప్పించగలిగారు. అడవికొలను సొసైటీ చానమిల్లి రైతులకు పంటల బీమా మంజూరు చేయించకపోవడంతో వినియోగదారుల సంఘం తరఫున పోరాడి 90 మంది రైతులకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇప్పించగలిగారు.
భీమవరం/ఆకివీడు/భీమవరం(ప్రకాశం చౌక్) : ఇటీవల జిల్లాలో తూనికలు, కొలతల్లో వ్యాపారుల మోసం ఎక్కువైంది. వినియోగదారులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు రావడంతో మోసం చేసేవారికి మరింత సులువైంది. నిత్యావసరాలు, కూరగాయాలు, చికెన్, మటన్ వంటివే గాకుండా రైతుల వద్ద వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం, చేపలు, రొయ్యల తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తూకాల్లో మోసాలపై వినియోగదారుల సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు. చర్యలు లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు మోసమే ధ్యేయంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. కిలోకు దాదాపు 100 గ్రాముల తక్కువ బరువుతో వినియోగదారుడిని మోసగిస్తున్నారు. తక్కెడకు వినియోగించే కిలో, అర కిలో రాళ్లను తూనికలు, కొలతల అధికారులు నిత్యం పర్యవేక్షించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో కొంతమంది వ్యాపారులు రాళ్లను అరగదీయడం, లోపల కన్నాలు పెట్టి పైన పూత వేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలు తయారుచేసే కంపెనీలు సక్రమంగా బరువువచ్చేలా ఏర్పాటుచేస్తున్నా వాటిని కూడా వ్యాపారులు తమకు అనుకూలంగా సెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 90 శాతం ఎలక్ట్రానిక్ కాటాలను ఉపయోగిస్తున్నా వాటి చిప్‌లు మార్పులు చేసి తూకంలో మోసం చేస్తున్నారు.
పెట్రోల్ బంకుల్లో మోసాలు
పెట్రోల్ కంపెనీలు డీలర్లుకు బంక్‌లను లీజుకు ఇచ్చి నిర్వహణ చేస్తుంటాయి. కొందరు డీలర్లు పెట్రోల్, డీజిల్ పంపులకు ఉండే డిజిటల్ మిషన్‌లో కంపెనీలకు తెలియకుండా మార్పులు, చేర్పులు చేసి వియోగదారురులను మోసగిస్తున్నాయి. స్వీట్ షాపు యజమానులు తూనికల్లో మోసం చేస్తున్నారు. వినియోగదారులకు కేవలం స్వీట్ మాత్రమే తూకం వేయాల్సివుండగా స్వీట్స్ పెట్టే బాక్స్‌లను సైతం తూకం వేసి విక్రయిస్తున్నారు.
మాంసం విక్రయాల్లో అక్రమాలు
మాంసం విక్రయాల్లోను వినియోగదారుడు మోసానికి గురువుతున్నారు. మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు విక్రయిస్తున్నారు. నిల్వ మాంసం తినడం వల్ల అనేక మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. అడపాదడపా మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు దాడులు చేసి నిల్వ మాంసాన్ని సీజ్ చేయడం మినహా పెద్దగా చర్యలు లేకపోవడంతో వ్యాపారులు భయపడుతున్న దాఖలాలు లేవు.
నామమాత్రంగా వినియోగదారుల సంఘాలు
వినియోగదారులు మోసపోకుండా నిత్యం అవగాహన కల్పించి వారికి అండగా ఉండాల్సిన వినియోగదారుల సంఘాలు నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. గత ఏడాది కాలంగా వినియోగదారుల సంఘం జిల్లా వ్యాప్తంగా ఒక్క కేసు కూడా నమోదు చేయించలేదంటే వాటి పనితీరు అవగతమవుతోంది. ప్రభుత్వ పరంగా విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసినా తరచు సమావేశాలు ఏర్పాటు చేయకపోవడంతో కమిటీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నాయి.
న్యూస్‌రీల్
వినియోగదారుల రక్షణ ఇలా..
వినియోగదారుల చట్టం బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది. 1986లో తీసుకొచ్చిన వినియోగదారుల చట్టానికి 2019లో చేసిన సవరణలతో ఈ చట్టానికి విశేష అధికారాలు వచ్చాయి. జరినామాతో పాటు జైలుకు కూడా పంపొచ్చు. వస్తువు ఎక్కడ కొనుగోలు చేసినా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చు. కేవలం తెల్లకాగితంపై ఫిర్యాదు రాసి వినియోగదారుల ఫోరంలో సమర్పించవచ్చు. జిల్లా స్థాయిలో వినియోగదారుల కమిషన్ ఉండటంతో పాటు దీని పరిధిలో అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఈ కమిషన్‌కు సాధారణ కోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఉంటాయి.
మనం కొనే వస్తువు, అందించే సేవలో ఏదైనా లోపం ఉంటే న్యాయం పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగిన వస్తువులు లేదా సేవలు పొందడం వినియోగదారుడి ప్రాథమిక హక్కు. ఇటీవల కాలంలో వస్తువుల్లో నాణ్యతా లోపాలు, తూకాల్లో మోసాలు, సేవల్లో నిర్లక్ష్యం వంటివి ఎక్కువై పోయాయి. తాగే పాలు, నీళ్లను కూడా కల్తీ చేస్తున్నారు. సామాన్యుడు వీటిని ప్రశ్నించలేక ఎక్కడికక్కడ సర్దుకుపోతున్నాడు. ఈ తరహా మోసాలను అరికట్టేందుకు వినియోగదారుడు మేల్కొనాలి. అందుకే ఏటా మార్చి 15న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలకు చెక్
వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుతో అక్రమాలకు అడ్డుకట్ట
నేడు అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం

మీ అవగాహనే బ్రహ్మాస్త్రం