
రహదారి భద్రత.. అంతా మిథ్య !
దెందులూరు : జిల్లాలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై ప్రయాణం ప్రమాదభరితంగా మా రింది. వాహనాల అతివేగాన్ని గుర్తించే స్పీడ్ గన్స్, వాహనాల డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసే పరికరాలు పనిచేయకపోవడం, పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కరువవడం ప్రమాదాలకు కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో దెందులూరు నియోజకవర్గంలోని జాతీయరహదారిపై ప్రమాదాలు అధికా రులకు పెను సవాల్‌గా మారాయి.
బ్రీత్ అనలైజర్స్ పరీక్షలేవీ
జిల్లాలో జాతీయ రహదారిపై మద్యం తాగి వాహనాలు నడిపే వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరగడం లేదు. రవాణాశాఖ అధికారుల వద్ద ఉన్న బ్రీత్ అనలైజర్స్ పనిచేయకపోవడమే ఇందుకు కారణం. పెద్ద ఖరీదు లేకపోయినా కనీసం బ్రీత్ అనలైజర్స్‌ను కూడా కూటమి ప్రభుత్వం సమకూర్చడం లేదనే విమర్శలు ఉన్నాయి.
రంబల్ స్ట్రిప్స్ ఎక్కడ?
జాతీయరహదారిపై వాహనాల వేగానికి కళ్లెం వేసే రంబల్ స్ట్రిప్స్ ఎక్కడా కనిపించడం లేదు. బ్రిడ్జిలు, టర్నింగ్‌ల వద్ద వీటిని ఏర్పాటుచేస్తే కొంతమేర వాహనాల వేగం తగ్గుతుంది.
సిబ్బంది కొరత
రవాణా శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో ఒక డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఆర్‌టీఓ, ఏడుగురు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, 15 మంది అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. అయితే వీరికి సహాయకారిగా ఉండే కానిస్టేబుళ్లు ఒక్కరూ లేరు. సాధారణంగా ఒక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు ఒక కానిస్టేబుల్ ఉండాలి. దీంతో ఎంవీఐ, ఏఎంవీఐలే రహదారి పర్యవేక్షణ పనులు చూస్తున్నారు.
రవాణా చెక్‌పోస్టులు లేవు
జిల్లాలో జాతీయ రహదారిపై రవాణా చెక్ పోస్టులు కూడా లేవు. గతంలో జిల్లాలో 16 వరకు చెక్‌పోస్టులు ఉండగా ప్రస్తుతం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ఎన్‌హెచ్‌పై రవాణా చెక్‌పోస్టులు ఉంటే వాహనచోదకులు జాగ్రత్తగా వెళతారని, మితిమీరిన వేగం తగ్గుతుందని పలువురు అంటున్నారు.
టోల్‌గేట్ల వద్దే హైవే పెట్రోలింగ్ పోలీసులు
హైవే పెట్రోలింగ్ పోలీసులు టోల్‌ప్లాజాలకే పరిమి తమవుతున్నారు. నిత్యం జాతీయ రహదారి వెంబ డి తిరుగుతూ ఎక్కడైనా వాహనాలు నిలిచిపోయి నా, ప్రమాదాలు జరిగినా వీరు సహాయక చర్యలు అందించాల్సి ఉంది. అయితే కొన్ని పెట్రోలింగ్ వా హనాలు టోల్‌గేట్ల వద్ద, మరికొన్ని చెట్ల కింద నిలిపి ఉంటున్నాయి. ఇలా భద్రతా లోపాలు, పర్యవేక్షణ లేమి, పరికరాల లోటుతో తరచూ ఎన్‌హెచ్‌పై ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పనిచేయని స్పీడ్ గన్స్, బ్రీత్ అనలైజర్స్
రవాణా శాఖలో సిబ్బంది కొరత
రవాణా చెక్‌పోస్టులూ లేవు
టోల్‌ప్లాజాలకే పరిమితమవుతున్న ఎన్‌హెచ్ పెట్రోలింగ్ వాహనాలు
ఎన్‌హెచ్–16పై పర్యవేక్షణ కరువు
గత ప్రభుత్వంలో పక్కాగా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జాతీయ రహదారిపై స్పీడ్ గన్స్ పనిచేయడంతో పాటు వాటి పర్యవేక్షణకు డీఎస్పీ స్థాయి అధికారి ఉండేవారు. అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి వాహన యజమానులకు జరిమానాలు పంపేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్పీడ్ గన్స్ పనిచేయడం లేదు. వీటి పర్యవేక్షణ కరువవడంతో జరిమానాల మాటేలేదు. దీంతో వాహనచోదకులు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాల బారినపడుతున్నారు. ఈ ప్రాంతంలో నిబంధనల మేరకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా 120 కిలోమీటర్లకు మించి వేగంతో కొన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయి.
ప్రమాదాల నివారణకు సమష్టి కృషి
జిల్లాలో ప్రమాదాల నివారణకు కృషిచేస్తున్నాం. ఆరు నెలల్లో పలు రకాల వాహనాలపై 15,105 కేసులు నమోదు చేసి రూ.9.26 కోట్లు అపరాధ రుసుంగా వసూ లు చేశాం. రవాణా శాఖలో సిబ్బంది కొరత ఉంది. తమ అధికారుల ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో 174 అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు నిబంధనలు తప్పక పాటించాలి. జాతీయ రహదారులపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం.
– కరీం, జిల్లా రవాణా శాఖ కమిషనర్, ఏలూరు

రహదారి భద్రత.. అంతా మిథ్య !