
ఫెర్రీ ఆదాయానికి కన్నం
సాక్షి, భీమవరం: నరసాపురం–సఖినేటిపల్లి ఫెర్రీ నిర్వహణను కారుచౌకగా కొట్టేసే పనిలో కూటమి నేతలు ఉన్నారు. 2025–26కి సంబంధించి ఫెర్రీ నిర్వహణకు ఈనెల 26న వేలం నిర్వహించనుండగా 2024–25 మాదిరి కాంట్రాక్టర్లను సిండికేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలను నరసాపురం రూరల్ మాధవాయిపాలెం–సఖినేటిపల్లి ఫెర్రీ రేవు చేరువ చేస్తుంది. వశిష్ట గోదావరికి అటు ఇటు ఉన్న రెండు రేవుల మధ్య పంటుల ద్వారా రోజూ అధిక సంఖ్యలో ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు వరకు రేవు నిర్వహణకు ఏటా అధికారులు బహిరంగ వేలం నిర్వహిస్తారు. వచ్చిన ఆదాయాన్ని నరసాపురం, సఖినేటిపల్లి మండల పరిషత్‌లకు చెందేలా రెండు జిల్లాలకు చెందిన అధికారులతో ఏర్పాటుచేసిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పర్యవేక్షిస్తుంది.
నష్టాల పేరుతో స్కెచ్
గతేడాది మే నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా ఫెర్రీ బహిరంగ వేలం నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫెర్రీలో రవాణా చార్జీలుగా ఒక మనిషికి రూ.20, వాహనంతో పాటు ఒకరికి రూ.35, సైకిల్‌తో పాటు ఒకరికి రూ. 20, కారుకు రూ.150, ఆటోకు రూ.100లు వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.లక్షకు పైనే ఆదాయం వస్తుందని అంచనా. ఈ మేరకు గతేడాది వేలం ఆదాయం మరింత పెరుగుతుందని అంతా భావించారు. కాగా నష్టం పేరిట కూటమి నాయకులు ప క్కా స్కెచ్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. 2023–24లో వేలం ధర రూ.3,60,99,999కు రూపాయి జోడించి 2024–25కు సంబంధించి రూ.3.61 కోట్లు ప్రారంభ ధరగా నిర్ణయించి గతేడాది జూన్ 21న జేఏసీ వేలం నోటీసు ఇచ్చారు. తర్వాత జూలై 2, 11 తేదీల్లో నోటీసులు ఇచ్చారు. వేలానికి ఎవరూ రాలేదన్న సాకుతో ప్రారంభ ధరను రూ.2.97,83,217కు తగ్గించి ఆగస్టులో సీల్డ్ కవర్, బహిరంగ వేలం నిర్వహించారు. ప్రారంభ ధరకు అదనంగా రూ.16,791 మాత్రమే జోడించిన సొసైటీకి వేలం ఖరారు చేయించారు. 12 నెలల కాలానికి మొత్తం వేలం ధర రూ.2,98,00,008 కాగా అప్పటికే ఐదు నెలలు గడిచిపోవడంతో మిగిలిన ఏడు నెలలకు అయిన మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని పాటదారులకు కల్పించారు. ఈ వ్యవహారంలో రేవు నిర్వహణలో ఆరితేరిన కొందరు నేతలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. వేలం సొసైటీ పేరున ఉన్నా నిర్వహణ అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభ ధరపై రూ.కోటికి పైగా హెచ్చు ధర రాగా ఇప్పుడు కేవలం రూ.వేలల్లో మాత్రమే వచ్చి నా అధికారులు ఆమోదించడం అనుమానాలకు తావిస్తోంది. రేవులో నష్టం వస్తుంటే గత ప్రభుత్వంలో మూడుసార్లు వేలం ధర అంత భారీగా ఎందుకు పెరిగిందన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
తక్కువ ధరకు దక్కించుకునేలా..
2025–26కి సంబంధించి రేవు నిర్వహణకు ఈనెల 21న బహిరంగ, సీల్డ్ టెండర్ల పద్ధతిలో వేలం నిర్వహణకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. పాట ప్రారంభ ధర రూ.3.13 కోట్లుగా నిర్ణయించారు. ఈసారీ తక్కువ ధరకు వేలం దక్కించుకునే పనిలో కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా నిబంధనల మేరకే ఫెర్రీ వేలం నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
నరసాపురంలో ఫెర్రీ రేవు
సంవత్సరం ప్రారంభ ధర హెచ్చుపాట పెరిగిన మొత్తం
(రూ.లలో) (రూ.లలో) (రూ.లలో)
2018–19 1,86,70,670 1,87,29,999 59,329
2019–20 1,90,00,000 1,90,09,999 9,999
2020–21 1,94,23,332 2,00,05,000 5,81,668
2021–22 కోవిడ్ కారణంగా అధికారుల పర్యవేక్షణలో నిర్వహణ
2022–23 1,78,99,644 2,79,99,999 1,01,00,355
2023–24 2,17,10,650 3,60,99,999 1,43,89,349
2024–25 2,97,83,217 2,98,00,008 16,791
ఫెర్రీ వేలం
పంటు.. లాభాలు లేవంటూ..
నరసాపురం–సఖినేటిపల్లి ఫెర్రీలో కూటమి నేతల హవా
గతేడాది ఆదాయానికి గండికొట్టిన వైనం
2025–26కి ఈనెల 21న వేలం
మరలా తక్కువ ధరకు ఫెర్రీ దక్కించుకునే ప్రయత్నం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గణనీయంగా ఫెర్రీ ఆదాయం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భారీగా ఆదాయం
2019 మే నెలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా 2019–20కి గాను అప్పటికే టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ఫెర్రీ వేలం జరిగిపోయింది. ఆ ఏడాది వేలం ప్రా రంభ ధరపై హెచ్చు ధర కేవలం రూ.9,999 మాత్రమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తొలిసారిగా 2020–21కి వేలం నిర్వహించారు. అప్పటివరకు ప్రారంభ ధరపై కేవలం వేలల్లో మాత్రమే ఉన్న హెచ్చు ధర మొదటిసారిగా రూ.5.82 లక్షలకు పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021–22లో అధికారుల పర్యవేక్షణలో రేవు నిర్వహణ సాగింది. తర్వాత 2022–23కి జరిపిన వేలంలో ప్రారంభ ధరపై రూ.1.01 కోట్లు హెచ్చు ధర రాగా, 2023–24లో రూ.1.44 కోట్లు హెచ్చు ధర రావడం గమనార్హం. 2024–25కి సంబంధించి మార్చిలోపు వేలం నిర్వహించాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది.