
దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
నరసాపురం: పట్టణంలో ఓ తాళంవేసిన ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామానికి చెందిన సిడగం కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.5 లక్షలు విలువ చేసే 5.250 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి నరసాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసాపురం డీఎస్పీ డాక్టర్ బి.శ్రీవేద వివరాలు వెల్లడించారు. పట్టణంలోని స్టీమర్‌రోడ్డులో నివాసం ఉంటున్న యర్రాప్రగడ సుబ్బారావు ఈ ఏడాది జనవరి 31న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. అయితే ఈ నెల 3న సుబ్బారావు కుమారుడు వరుసయ్యే కార్తీక్ ఇంటికి వెళ్లి చూసి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి ఫోన్ ద్వారా సుబ్బారావుకు తెలిపాడు. దీంతో బంధువులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఇనుప బీరువాలోనూ, పూజ గదిలోనూ ఉంచిన వెండి వస్తువులు దొంగిలించుకుపోయారని గుర్తించి పోలీసుకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని డీఎస్పీ శ్రీవేద తెలిపారు. అతనిపై పలు జిల్లాల్లో 15కు పైగా దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. కుమార్‌తో పాటు కలిపి దొంగతనం చేసిన విజయవాడకు చెందిన ఉయ్యాల నరేష్, అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రేలంగి కృష్ణబాబు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుడి నుంచి వెండి వస్తువులతో పాటు హైదరాబాద్‌లో చోరీ చేసిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ బి.యాదగిరి, ఎస్సైలు సీహెచ్ జయలక్ష్మి, ఎస్‌ఎన్ ముత్యాలరావు పాల్గొన్నారు.