
తలరాతను మార్చే చేతిరాత
భీమడోలు: చేతిరాత తలరాతను మార్చుతుంది అనే నానుడి అక్షర సత్యం అవుతుందని నిపుణులు చెబతున్నారు. గతంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు ఉత్తరాలపై ఆధారపడేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు. దీంతో చేతిరాతపై ఆసక్తి సన్నగిల్లుతుంది. అయితే జీవితానికి కీలకమైన పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి జరగున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి చేతిరాత కీలకంగా మారనుంది. ముత్యాల్లాంటి దస్తూరితో ఉపాధ్యాయులను మెప్పిస్తే మంచి మార్కులు సొంతమవుతాయని చేతిరాత నిపుణులు చెబుతున్నారు. ఏడాది పాటు కష్టపడి చదివినా పరీక్షల్లో అందమైన చేతిరాతతో సమాధానాలు రాస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో చేతిరాత నిపుణులు విద్యార్థులకు పలు సూచనలు చేస్తున్నారు.
నిపుణుల సూచనలివే
● విద్యార్థులు రివిజన్ సమయంలో చేతిరాతపై దృష్టి పెట్టాలి.
● పరీక్ష రాసే సమయంలో కాగితంపై మరీ ఒత్తిపెట్టి రాయకూడదు. ఇలా చేస్తే ఇది వేగంపై ప్రభావం చూపుతుంది.
● సున్నా, నిలువు గీతాలపై సాధన చేయాలి. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఆపసవ్య దిశలో, హిందీలో సవ్యదిశలో రాయడం మంచిది.
● బుక్‌లెట్‌లో కుడి, ఎడమల్లో కొంత మార్జిన్ వదిలి రాయాలి. పేజీకి ఇరవై లైన్లు మించి రాయకూడదు.
● పదాలు రాసేటప్పుడు మొదటి అక్షరం పెద్దగా ఉండాలి. ఇంగ్లీషు పదాలు మూడు మిల్లీ మీటర్లు, హిందీ, తెలుగు అక్షరాలు నాలుగు మిల్లీ మీటర్లు పొడవు ఉండేలా రాస్తే అక్షరాలు ముత్యాల్లా ఉంటాయి.
● పదానికి పదానికి మధ్య దూరం ఒక అక్షరం ఉండాలి. రాసే కొద్దీ అక్షరాల ఆకారం మారిపోకూడదు. అందంగా రాస్తూనే వేగం పెంచి రాయాలి.
● రాసే తరుణంలో కూర్చునే భంగిమ, పెన్ను పె ట్టుకునే విధానం, రాసే విధానం ఒకేలా ఉండాలి.
● తెలుగులో అక్షరాలు గుండ్రంగా ఉండాలి. ఇంగ్లీషులో చక్కని స్ట్రోక్స్‌తో కొద్దిగా వాలు కలిగి అందమైన ఆకారం రాయాలి.
● కుడి చేత్తో రాసే వారు పేపర్, బుక్‌లెట్‌ను కాస్త ఎడమ వైపునకు, ఎడమ చేత్తో రాసేవారు కుడి వైపునకు వంచి రాయాలి.
● ముఖ్యంగా వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఆంగ్లంలో స్పెలింగ్‌లు తప్పులు లేకుండా ఉండాలి. పరీక్షా ముగింపు సమయానికి 5, 10 నిమిషాల ముందు పూర్తి అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలి.
● అర్థవంతమైన పదాలను విడగొట్టకుండా చూసుకోవాలి. కొట్టి వేతలు లేకుండా జాగ్రత్త పడాలి.
అందమైన దస్తూరితో అధిక మార్కులు
విద్యార్థులకు ప్రత్యేక సూచనలిస్తున్న ఉపాధ్యాయులు
తప్పులు లేకుండా చూసుకోవాలి
పరీక్ష రాసే విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా పొందుగ్గా అక్షరాలు రాయడంపై దృష్టి సారించాలి. క్వశ్చన్ పేపర్‌లో బాగా వచ్చిన ప్రశ్నకు సమాధానం రాయాలి. రాసే తరుణంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇచ్చిన బుక్‌లెట్‌లో పేజీలన్నీ రాస్తే మంచిది. దస్తూరితోనే అదనంగా మార్కులు పొందుతారు. చిన్న అక్షరాలు కంటే పెద్ద అక్షరాలు రాయండి.
– పొత్తూరి కృష్ణంరాజు(వాసు) చేతిరాత నిపుణుడు, నారాయణపురం
సమయాన్ని వృథా చేసుకోవద్దు
పరీక్షా పేపర్‌ను చదివిన తర్వాత బాగా వచ్చిన ప్రశ్నకు సమాధానం రాయాలి. తొందర పడొద్దు. కష్టమైన ప్రశ్న రాయడానికి సిద్ధపడి సమయాన్ని వృథా చేసుకోవద్దు. మనోధైర్యాన్ని కోల్పోతే భయం, ఒత్తిడి పెరుగుతంది. ఇంగ్లీషు గ్రామర్ పాయింట్లు, లెక్కలల్లో ఫార్ములాలు, సోషల్‌లో మ్యాప్‌లు, సైన్సులో డయాగ్రామ్‌లు వేయాలి. దస్తూరి బాగుండి.. చక్కగా ప్రజెంటేషన్‌తో అదనపు మార్కులు సాధిస్తారు. – ఈదుపల్లి శ్రీనివాసరావు, ఎంఈఓ, భీమడోలు

తలరాతను మార్చే చేతిరాత

తలరాతను మార్చే చేతిరాత

తలరాతను మార్చే చేతిరాత