ఏలూరు టౌన్: ఏలూరులో జాతీయ రహదారిపై రెండు చోట్ల జరిగిన వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం వేకువజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో ఏలూరు జాతీయ రహదారిలోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి కాకినాడ నుంచి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ కాకినాడ డిపోకు చెందిన (ఏపీ 39జెడ్ ఓ0826) సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొంది. బస్సు డ్రైవర్ క్షేమంగా ఉండగా లారీ డ్రైవర్ కడియం రామశేషుతోపాటు బస్సులోని 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు సత్యసాయి (కాకినాడ), కర్రి హారిక (రావులపాలెం), వి.రాజు (మాచవరం), సుబ్రహ్మణ్యం (కాకినాడ), కె.సురేష్ (కాకినాడ), జె.పవన్‌కుమార్ (కాకినాడ), వెంకటలక్ష్మి (రామచంద్రపురం), ఆరేపల్లి సాయి దుర్గాప్రసాద్ (తణుకు) వి.దత్తు నాయక్ (గుంటూరు), ఆకుల శివాజీ (కడియపులంక)లను ఏలూరు జీజీహెచ్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. త్రీటౌన్, హైవే పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బస్సును ఢీకొన్న లారీ
మరో ప్రమాదంలో ఆర్టీసీ బస్సును ట్రాలర్ లారీ వెనుక నుంచి ఢీకొంది. విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న (ఏపీ16 జెడ్‌ఓ 0641) ఆర్టీసీ బస్సు ఏలూరు జాతీయ రహదారిపై ప్రభుత్వ గురుకుల పాఠశాల సమీపానికి చేరుకునే సరికి వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం చాలా వరకూ దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లారీ, బస్సు డ్రైవర్లకు సైతం ఎలాంటి గాయాలు కాలేదు. ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బస్సుల ప్రమాదంతో కలకలం
ఏలూరు జాతీయ రహదారిపై ఆరు రోజుల్లో నాలుగు బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవల చొదిమెళ్ల వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. అలాగే ఆశ్రం హాస్పిటల్ సమీపంలో మరో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. తాజాగా మరో రెండు ప్రమాదాలు జరగడం కలకలం రేపుతోంది.
11 మందికి స్వల్ప గాయాలు
రెండు వేర్వేరు బస్సు ప్రమాదాలు
రెండు వేర్వేరు బస్సు ప్రమాదాలు