● గిట్టుబాటు ధర రాక రైతుల గగ్గోలు
● ఎగుమతిదారుల సిండికేట్‌తో రొయ్యల ధర నేలచూపులు
● భారీగా పెరిగిపోయిన ఆక్వా ఫీడ్, మందుల ధరలు
● రొయ్యల రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
వీరవాసరం: రొయ్య రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆక్వా రంగం కుదేలవుతుంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయానికి తగ్గట్టు ఉత్పత్తి అయిన రొయ్యలకు సరైన ధర లభించకపోవడంతో ఆక్వా రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. రొయ్యల ఎగుమతిదారులు సిండికేట్‌గా తయారై ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి అయ్యే సమయానికి ఇష్టారాజ్యంగా ధరలను తగ్గించడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు.
ఆకాశాన్నంటుతున్న ఫీడ్, మందుల ధరలు
పశ్చిమగోదావరి జిల్లాలో 18,923 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. వందలాది కుటుంబాల వారు ఆక్వా రంగంలో కార్మికులుగా జీవనోపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఆక్వా ఫీడ్, మందుల ధరలు భారీగా పెరిగిపోవడం, నాణ్యమైన సీడు లభించకపోవడంతోపాటు నిత్యం రొయ్యల ధరలు నేలచూపులు చూడడం వంటి కారణాలతో ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పదేళ్ల క్రితం కేజీ 100 కౌంట్ రొయ్యల ధర రూ.240 నుంచి 250 ఉండగా ప్రస్తుతం రూ.225 నుంచి 230 వరకు ఉంది. కానీ గతంలో కేజీ ఒక్కింటికి రూ.70 నుంచి 72 పలికిన రొయ్యల ఫీడ్ ధర ప్రస్తుతం 94 నుంచి రూ.97 వరకు పెరిగిపోయింది. అలాగే మెడిసిన్ ధరలు పదేళ్ల నాటితో పోలిస్తే 50 నుంచి 60 శాతం పెరిగిపోయాయి. కానీ రొయ్యల ధరలు మాత్రం పెరగలేదు. ఒక కేజీ 100 కౌంట్ రొయ్య ఉత్పత్తి చేయాలంటే ఫీడ్, సీడ్, మెడిసిన్, లీజు, ఇతర ఖర్చులు కలిపి రూ.260 నుంచి 275 వరకు ఖర్చు అవుతుంది. కనీసం ఉత్పత్తి ఖర్చు కూడా రాకపోవడంతో నిత్యం రొయ్యల రైతులు నష్టాల బారిన పడుతున్నారు.
కూటమి ప్రగల్భాలు
గత 15 రోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన ఆక్వా ఫెస్ట్‌లో రైతులు తమను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి అచ్చెం నాయుడు తదితరులకు వినతి పత్రం అందజేశారు. ఈ ఆక్వా ఫెస్ట్ లో ఆక్వారంగాన్ని ఎక్కడికో తీసుకెళ్తానని ప్రభుత్వ పెద్దలు ప్రగల్భాలు పలికారు. తర్వాత మూడు నాలుగు రోజులకు ఏమైందో కానీ పరిస్థితి దానికి భిన్నంగా తయారైంది. ఆక్వా ఎగుమతిదారుల గుత్తాధిపత్యం కారణంగా టన్నుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ధరలు తగ్గించడంతో ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వంలో అప్సడా ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం చర్చలు జరుపుతూ రొయ్యల రైతులకు అండగా నిలిచారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రొయ్యల ఎగుమతి దారులకు, రొయ్యల ఫ్యాక్టరీ యజమానులకు, ఫీడ్ మందుల కంపెనీలకు కొమ్ముకాస్తూ తమను నట్టేట ముంచుతోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఇటీవల రొయ్యల రైతులు ఆందోళన బాట పట్టారు. తమను ఆదుకోవాలంటూ నిరసనలు చేశారు.
రొయ్యల ధరలను స్థిరీకరించాలి
15 రోజుల క్రితం 100 కౌంటు కిలో రొయ్యల ధర రూ.260 ఉండేది. ఒక్కసారిగా 100 కౌంట్ రొయ్యల ధర కేజీ ఒక్కింటికి రూ.225 చేసేశారు. రొయ్యల ఎగుమతిదారులు సిండికేట్ అయ్యి ఇష్టానుసారంగా ధరలను తగ్గించేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం రొయ్యల ధరలను స్థిరీకరించి రైతులను ఆదుకోవాలి.
సర్వేశ్వరరావు, వీరవాసరం మండల రొయ్యల రైతుల అసోసియేషన్ కార్యదర్శి
ఆక్వా రైతు కుదేలు
ఆక్వా రైతు కుదేలు