కొడుకే హంతకుడు | Sakshi
Sakshi News home page

కొడుకే హంతకుడు

Published Fri, Nov 17 2023 12:58 AM

నిందితుడిని అరెస్ట్‌ చేసి వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటేశ్వరరావు   - Sakshi

బుట్టాయగూడెం(జీలుగుమిల్లి): జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం ఎర్రచెరువు సమీపంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో మిస్టరీ వీడింది. కన్నకొడుకే తల్లిని చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. గురువారం సీఐ బి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెంకు చెందిన కన్నోజు అనసూయ(65) చిన్నకుమారుడు శ్రీను వద్ద ఉంటోంది. తనకొచ్చిన పింఛను, పొదుపు చేసిన సొమ్ము మొత్తం రూ.50 వేలు దాచుకుని చిన్నకుమారుడు శ్రీనుకి ఇచ్చింది. తల్లి దగ్గర తీసుకున్న డబ్బులను శ్రీను ఆ గ్రామంలో మరో వ్యక్తికి అప్పుగా ఇచ్చాడు. మూడు రోజుల క్రితం తాను దాయమని ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని అనసూయ శ్రీనుపై ఒత్తిడి తెచ్చింది. శ్రీను ఆ సొమ్మును అప్పు చేసి ఈ నెల 13న తిరిగి ఇచ్చాడు. తన తల్లి వల్ల అప్పు చేయాల్సి వచ్చిందని కోపాన్ని పెంచుకున్నాడు. కొడుకు నుంచి డబ్బులు తీసుకున్న అనసూయ ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. రాత్రి మళ్లీ ఇంటికి వచ్చిన అనసూయ కొడుకు శ్రీనుతో గొడవ పడింది. కోపంతో శ్రీను పక్కనే ఉన్న టేకు చెక్కతో మోకాళ్ళపై కొట్టాడు. ఆమె బాధతో బయటకు వెళ్ళిపోయింది. పెద్దలకు చెబుతుందనే భయంతో శ్రీను వెనకే వెళ్ళి వీధి చివర మలుపు సమీపంలో ఆమె గొంతు నొక్కి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి వెళ్ళి ఆమె చెప్పులు తీసుకుని అక్కడి నుంచి మృత దేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్ళి ఎర్ర చెరువు వద్ద పడేశాడు. హత్య చేసిన విషయాన్ని కామయ్యపాలెం వీఆర్‌ఓ శ్రీను ఒప్పుకున్నాడు. మృతురాలు కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మహిళ అనుమానాస్పద మృతి కేసులో

వీడిన మిస్టరీ

Advertisement
 
Advertisement