
తాడేపల్లిగూడెం రూరల్ : వ్యవసాయ అనుబంధ 64 రంగాల అభివృద్ధికి ఒక శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పించనున్నట్టు రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. 70వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని కొమ్ముగూడెం సొసైటీని ఆయన సందర్శించారు. తొలుత సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏఎం(అడ్వాన్స్‌డ్ అమౌంట్) పథకం 2024లో ముగుస్తుందని, మరో రెండేళ్ళు గడువు పెంచామన్నారు. ప్రస్తుతం వంద కోట్ల టర్నోవర్ ఉన్న కొమ్ముగూడెం సొసైటీ త్వరలోనే రూ.200 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని ఆకాంక్షించారు. సొసైటీల అభివృద్ధికి అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. సొసైటీ ఆవరణలోని గోదాం, సొసైటీ మార్కెట్, ఎరువులు, పురుగు మందుల దుకాణం, వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు. సొసైటీ చైర్మన్ వెలిశెట్టి నరేంద్రకుమార్, సొసైటీ సీఈవో కృష్ణశర్మలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ సీజీఎం వెంకటరత్నం, జనరల్ మేనేజర్ పీఎస్.మణి, డీజీఎం ఎండి.తిలక్, వెంకటరత్నం, డీసీసీబీ సీఈవో బి.శ్రీదేవి, డీజీఎం షఫీ, డీపీడీఎం తులసీధర్, సొసైటీ అకౌంటెంట్ త్రిమూర్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సొసైటీల ద్వారా రూ.29 వేల కోట్ల రుణాలు
రాష్ట్ర వ్యాప్తంగా 13 డీసీసీబీ, 1995 సొసైటీల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.32 వేల కోట్ల రుణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు దాదాపు రూ.29 వేల కోట్ల రుణాలు అందించినట్లు రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్స్ (ఆప్కాబ్) ఎండీ డాక్టర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం సొసైటీ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఐదు నెలల్లో రుణ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ 64 రకాల రంగాలకు ఒక శాతం వడ్డీపై రుణ సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు.
ఆప్కాబ్ ఎండీ డాక్టర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment