
సమస్యలు వింటున్న కలెక్టర్ ప్రశాంతి
కలెక్టర్ ప్రశాంతి
నరసాపురం: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌కు రానవసరం లేకుండానే ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్య క్రమం మాదిరిగా ఇక్కడా ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బుధ, శుక్రవారాల్లో జిల్లాలోని ఒక్కో మండలంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తొలుత నరసాపురం మండలానికి సంబందించి జగనన్నకు చెబుదాం పెండింగ్ ఫిర్యాదులపై జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి సమీక్షించారు. మొత్తం 11 ఫిర్యాదులు అందినట్టు కలెక్టర్ ప్రశాంతి చెప్పారు. నరసాపురం ఇన్‌చార్జ్ సబ్‌కలెక్టర్ కె.కృష్ణవేణి, నరసాపురం డీఎస్పీ కె.రవిమనోహరాచారి, మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఎండీ ఫాజిల్ పాల్గొన్నారు.