
సాక్షి, భీమవరం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి (బెనర్జీ) (92) బుధవారం తుదిశ్వాస విడిచారు. స్వ ల్ప అస్వస్థతకు గురై న ఆయన భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందు తూ కన్నుమూశారు. ఉండి మండలం ఉప్పులూరులో జమిందారీ కుటుంబానికి చెందిన యర్రా సూర్యారావు, శేషాయమ్మ దంపతులకు 1931 ఏప్రిల్ 30న ఆయన జన్మించారు. లక్నో యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ అభ్యసించారు. అప్పటి ఏపీ హైకోర్టు గుంటూరు బెంచ్‌లో కొంతకాలం జూనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఉప్పులూరు సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధికి సొంత నిధులను వెచ్చించారు. అనంతరం ఉండి సహకార రూరల్ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
వెంగళరావు మంత్రివర్గంలో..
నారాయణస్వామి 1972లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంత్రివర్గంలో లఘు పరిశ్రమల శాఖ మంత్రి పదవి పొందారు. 1978లో ఉండి నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం ఎన్టీఆర్ ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 1987లో జిల్లాపరిషత్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. 1994లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1999లో మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. చంద్రబాబు ప్రాధాన్యమివ్వకపోవడంతో కొ న్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ భీమవరంలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెంలో విద్యా సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు అందించారు. ఆయన భార్య సీతాయమ్మ రెండేళ్ల క్రితం మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
నేడు అంత్యక్రియలు
స్వగ్రామం ఉప్పులూరులో గురువారం అంత్యక్రియ లు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపా రు. మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు ఫోన్‌లో కుటుంబసభ్యులను పరామర్శించారు.
మంత్రి కొట్టు దిగ్భ్రాంతి
తాడేపల్లిగూడెం అర్బన్: మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు యర్రా నారాయణస్వామి మృతికి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకపాత్ర వహించిన యర్రా లేకపోవడం తీరని లోటన్నారు. అజాత శత్రువుగా, నిరాడంబరుడిగా ఆయన ప్రజల మనన్నలు పొందారన్నారు. యర్రా మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంత్రి కారుమూరి సంతాపం
తణుకు అర్బన్: సీనియర్ రాజకీయ నేత యర్రా నారాయణస్వామి మృతి తీరని లోటని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.