
భీమవరం పొట్టిశ్రీరాములు బాలికల హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినులు
సాక్షి, భీమవరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేనెల 3 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 121 కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇప్పటికే నూరుశాతం ఉత్తర్ణత లక్ష్యంతో 100 రోజుల ప్రణాళికను రూపొందించి అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. 10 మంది విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడికి దత్తత ఇచ్చి చదివించేలా ఏర్పాట్లుచేశారు. అలాగే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ చదువులలో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించి ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకున్నారు.
376 పాఠశాలలు.. 24,586 మంది విద్యార్థులు
జిల్లాలో 376 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 24,586 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 12,929 మంది బాలురు, 11,657 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 121 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 121 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 24 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.
ఆరు సమస్యాత్మక కేంద్రాలు
జిల్లాలో ఆరు కేంద్రాలను సమస్మాత్మకంగా గుర్తించారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఎస్, పెంటపాడు మండలం అలంపురం జిల్లాపరిషత్ స్కూల్, ఆచంట మండలం ఎంపీ పాలెం జిల్లాపరిషత్ స్కూల్, పాలకోడేరు మండలం శృంగవృక్షం జిల్లాపరిషత్ స్కూల్, నరసాపురం మండలం సీతారామపురం ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఎస్, పెనుమంట్ర జిల్లాపరిషత్ స్కూల్ సమస్యాత్మక కేంద్రాల్లో ఉన్నాయి. వీటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమిస్తారు.
కేంద్రాల వద్ద..
కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వైద్య సదుపాయాలను కల్పిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఇప్పటికే ఆ శాఖ అధికారులు తెలియజేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే..
పరీక్షాల్లో ఎక్కడైనా మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే విద్యార్థులను డిబార్ చేయడంతోపాటు కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థి గదిలోని ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. పరీక్షా కేంద్రంలో అధికారులతో సహా ఎవరూ సెల్‌ఫోన్ వాడరాదని ఆదేశించారు.
ప్రశాంతంగా జరిగేలా..
జిల్లాలో టెన్త్ పరీక్షలు సక్రమంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెగ్యులర్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఉదయం, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనుండగా.. ఈ మేరకు ఏర్పాట్లు చేశాం. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి టెన్త్ విద్యార్థుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది.
– ఆర్.వెంకటరమణ,
జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం
