
లక్ష్మీపురంలో పూజలందుకుంటున్న చెట్ల మానులు (ఫైల్)
బుట్టాయగూడెం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో నాలుగు రకాల చెట్ల మానులను అడవి నుంచి తీసుకువచ్చి వాటిని దేవతామూర్తులుగా పూజలు చేస్తారు నాయక్‌పోడు గిరిజనులు. ఏటా శ్రీరామనవమికి గ్రామదేవత గంగానమ్మవారికి పూజలు చేసిన తర్వాత శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడిని పూజిస్తారు. చెట్ల మానులను పూజించడం నాయక్‌పోడు తెగలో తరతరాల ఆచారం. కమిటీ సభ్యులు ముందుగా అడవికి వెళ్లి చెండ్ర, పాల, ఊడిగ, రావి చెట్ల మానులను సేకరిస్తారు. చెండ్ర మానును రాముడిగా, పాల మానును సీతాదేవిగా, ఊడిగ మానును లక్ష్మణుడిగా, రావి మానును ఆంజనేయుడిగా చెక్కించి గ్రామ మధ్యలో ప్రతిష్ఠించి సీతారామ కల్యాణ్యాన్ని ఘనంగా జరిపిస్తారు.