
ఆలయ రికార్డులను దగ్ధం చేసిన నిందితుల వివరాలు చెబుతున్న డీఎస్పీ అశోక్‌కుమార్ గౌడ్
నూజివీడు: నూజివీడు మండలం గొల్లపల్లిలోని పురాతన ఆలయం రఘునాథస్వామి ఆలయంలోని రికార్డులను దహనం చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను నూజివీడు డీఎస్పీ ఈ అశోక్‌కుమార్ గౌడ్ బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల వద్ద వెల్లడించారు. ఈనెల 22న అర్ధరాత్రి సమయంలో ఆలయ ఈఓ కార్యాలయంలోకి దుండగులు చొరబడి రికార్డులను దహనం చేయడంతోపాటు, కంప్యూటర్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై ఈనెల 23న ఆలయ ఈఓ తల్లాప్రగడ విశ్వేశ్వరరావు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై తలారి రామకృష్ణ కేసు నమోదు చేశారని, ఆలయంలోని సీసీ కెమేరాలను పరిశీలించగా టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ యలర్తి ప్రభాకర్, మరికొందరు కలిసి ధ్వంసం చేసినట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామం నుంచి పరారైన యలర్తి ప్రభాకర్‌ను అతని అనుచరులైన టీడీపీ కార్యకర్తలు మిరియాల నవీన్, దోనేటి చిన్నయేసులను బుధవారం సీఐ రాజులపాటి అంకబాబు నేతృత్వంలో ఎస్సై రామకృష్ణ గొల్లపల్లి శివారులో అదుపులోకి తీసుకొన్నట్టు తెలిపారు. ఈ ముగ్గుర్నీ విచారించగా ఈనెల 21న టెండర్లను తెరిచే సమయంలో ఈఓకు ప్రభాకర్‌కు గొడవ జరగగా, ఈఓ తనను నలుగురితో అవమానకరంగా మాట్లాడడంతో రికార్డులను దహనం చేసినట్టు తేలిందన్నారు. ఏ1గా యలర్తి ప్రభాకర్, ఏ2 గా మిరియాల నవీన్, ఏ3గా దోనేటి చిన్నయేసులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని చెప్పారు. రూరల్ సీఐ అంకబాబు, ఎస్సై తలారి రామకృష్ణ పాల్గొన్నారు.