
అలివేరు – రేగులపాడు రోడ్డును పరిశీలిస్తున్న అధికారులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలోని మారుమూల దట్టమైన అటవీప్రాంత గ్రామాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పి.అరుణ్‌బాబు బుధవారం పర్యటించారు. ఎత్తైన కొండలు దాటుకుంటూ ద్విచక్రవాహనంపై ఎంతో సాహసంతో రేగులపాడు, రేపల్లె గ్రామాలను వారు సందర్శించారు. రేగులపాడు పాఠశాలలో కొండరెడ్డి గిరిజనులకు అందుతోన్న సౌకర్యాలపై ఉపాధ్యాయుడు సతీష్‌ను అడిగి తెలుసుకున్నారు. భోజన పథకం అమలుపై ఆరా తీశారు. అదే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, ఇక్కడ అందిస్తున్న సేవలపై గ్రామస్తులతో మాట్లాడారు. కోడిగుడ్లు అందుతున్నాయా అని ప్రశ్నించగా, కొందరు కొండరెడ్డి గిరిజనులు గుడ్లు తింటే జ్వరం వస్తుందన్నారు. పౌష్టికాహార లోపం లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా గుడ్లు తినాలని, అంగన్‌వాడీ కేంద్రంలో అందరికీ గుడ్లు ఇవ్వాలని జేసీ ఆదేశించారు. లంకపాకల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల వివరాలు, గోరుముద్దల పథకంలో భోజనం, రాగిజావ అందించే తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలివేరు నుంచి రేపల్లె వరకు సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులను జేసీ పరిశీలించారు. పనుల్లో నాణ్యతాలోపాల్లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ, ఇన్‌చార్జి డీడీ పీవీఎస్ నాయుడు, వేలేరుపాడు తహసీల్దార్ కె.చల్లన్నదొర, గిరిజన సంక్షేమ శాఖ డీఈ ఎస్ జొనాతన్, ఆర్‌ఐ పద్మావతి, సర్పంచ్ కారం లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు కె.గోవిందరాజులు, వీఆర్‌ఓలు, సచివాలయ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్ల తనిఖీ