
మాట్లాడుతున్న ఏఎన్‌జీఆర్‌ఏయూ విస్తరణ సంచాలకులు విజయాభినందన
ముదినేపల్లి రూరల్ : ముదినేపల్లి శివారు అన్నవరం నుంచి దేవరం వెళ్లే మార్గంలో ఉన్న వంతెన బుధవారం కుప్పకూలింది. ఉదయం చేపపిల్ల ల లోడు లారీ వెలుతుండగా వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. వ్యాను వంతెనలో కూరుకుపోయింది. దీంతో ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు సైతం అవకాశం లేకుండాపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కాకరవాడ మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత బేతపూడి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెనను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ముదినేపల్లి మండలం దేవరం కాకరవాడ, గుడ్లవల్లేరు, చినగొన్నూరు, పురిటిపాడు గ్రామాలకు వెళ్లేందుకు 70 ఏళ్ల క్రితం అన్నవరం సమీపంలోని డ్రెయిన్‌పై నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరింది. సమస్యను స్థానికులు అధికారులకు పలుమార్లు తెలియజేశారు. గత శనివారం ఈ వంతెనపై భారీ వాహనం వెళుతుండగా పాక్షికంగా కుంగిపోయింది. దీంతో భారీ వాహనాలు ప్రయాణించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
లాభసాటి వ్యవసాయానికి కృషి
పెనుమంట్ర: రైతుకు లాభసాటి వ్యవసాయం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ వి.విజయాభినందన అన్నారు. బుధవారం మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించిన కిసాన్‌మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేలా పరిశోధనలు చేయడమే ప్రథమ కర్తవ్యమన్నారు. మార్టేరులోని పరిశోధనా స్థానంలో సృష్టించిన వరి వంగడాలు దేశ విదేశాలకు వెళ్లి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా, రైతులకు ఆర్థిక పరిపుష్టిని అందించాయన్నారు. సహజ, మానవ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి మాట్లాడారు. తొలుత జెడ్పీటీసీ గౌరీ సుభాషిణి, సర్పంచ్‌లు ఎం.ధనలక్ష్మి, మట్టా కుమారిలు జ్యోతి ప్రజ్వలనతో మేళాను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ కై గాల శ్రీనివాసరావు, ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి, ఇన్‌చార్జి ఏడీఆర్ టి.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి జడ్ వెంకటేశ్వరరావు, రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
6 నుంచి హరికథా సప్తాహ మహోత్సవం
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని త్యాగరాజ భవన్‌లో ఏప్రిల్ 6 నుంచి 12 వరకు హరికథా సప్తాహ మహోత్సవాలు నిర్వహించనున్నట్టు నిర్వహణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చెరుకువాడ వెంకట్రామయ్య, చెరుకువాడ రంగసాయిలు తెలిపారు. కార్యక్రమ ఆహ్వాన పత్రికను జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు వబిలిశెట్టి కనకరాజు చేతులమీదుగా విడుదల చేశారు. రాష్ట్రంలోనే ప్రముఖులైన హరికథా విద్వాంసులు యండమూరి శిఖామణి భాగవతారిణి (రామచంద్రాపురం), కె.శారత భాగవతారిణి (తాడేపల్లిగూడెం), మొగిలిచర్ల నాగమణి భాగవతారిణి (తెనాలి), పురాణం విజయలక్ష్మి భాగవతారిణి (రాజమండ్రి), బుర్రా పద్మనాభ శర్మ భాగవతార్ (విజయవాడ), జయంతి సావిత్రి భాగవతారిణి (తిరుపతి) తదితరులు హరికథకులుగా వస్తున్నారని చెప్పారు. 12న వేదగోష్టి, డోలు విద్వాంసుల లయ విన్యాసాలు, అఖండ హారతి, అన్నదానం నిర్వహిస్తామని, ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి హరికథలు ప్రారంభమవుతాయని తెలిపారు. నిర్వహణ కమిటీ సభ్యులు అరసవిల్లి సుబ్రహ్మణ్యం, కోండ్రు శ్రీనివాసు, పెండ్యాల సరిత, నీలాతి పోతయ్య, రాయప్రోలు చలపతి తదితరులు పాల్గొన్నారు.

కూలిన దేవరం వంతెన, ఇరుక్కుపోయిన లారీ