
తాడేపల్లిగూడెంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న లక్ష్మణరావు
తాడేపల్లిగూడెం (టీఓసీ) : వేసవి కాలం ప్రారంభమైంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదై వేడి గాలులు రానున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ (సన్ స్ట్రోక్), డీ హైడ్రేషన్ (శరీరంలో లవణాలు కోల్పోవడం) అనేవి సాధరణంగా వచ్చే ఇబ్బందులు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణంతకమే.
వడదెబ్బ లక్షణాలు
వణుకు పుట్టడం, చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, పెదవులు ఎండిపోయి, నోరు పిడచకట్టుకుపోవడం, మగత నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షికంగా అపస్మారక స్థితి కలుగుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. లేత వర్ణం కల తేలికై న కాటన్ దస్తులు ధరించాలి. రోజూ కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు పూట్లా స్నానం చేయాలి. భోజనం మితంగా తినాలి. ఎండవేళ ఇంటి పట్టునే ఉండాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపి ధరించాలి. ఇంట్లో కిటికీలు తెరిచి ఉండాలి. ఫ్యాన్ వేసి గదిని చల్లగా ఉంచుకోవాలి.
చేయకూడని పనులు
వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత ఉన్న (మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు) సమయంలో ఎక్కువగా బయిటకు తిరగరారు. సూర్యకిరణాలకు, వేడి గాలికి నేరుగా గురికాకూడదు. రోడ్లపై అమ్మే చల్లని, రంగు పానీయాలు తాగరాదు. కలుషిత ఆహారం తినరాదు. మాంసాహారం తగ్గించాలి. మద్యం సేవించరాదు. ఎండ వేళలో శరీరంపై భారంపడు శ్రమగల పనులు చేయరాదు. నలుపు దుస్తులు, ముదురు రంగులు గల మందంగా ఉన్న దుస్తులు ధరించరాదు.
ప్రథమ చికిత్స అందించాలి
వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చల్లని నీటిలో ముంచిన తడి గుడ్డతో శరీరం తుడవాలి. చల్లని గాలి తగిలే విధంగా ఉంచాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్‌ఎస్) తాగించాలి. వడదెబ్బతో అపస్మారక స్థితికి చేరిన వ్యక్తికి నీరు తాగించరాదు. వీలైనంత వరకు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. – వైవీ లక్ష్మణరావు, మలేరియా సబ్ యూనిట్ అధికారి
