ముసునూరు: మహిళ అనుమానాస్పద మృతి మండలంలోని కలకలం సృష్టించింది. భార్య ఉరి వేసుకుందని భర్త చెబుతుండగా.. ఆమెది హత్యేనని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ముసునూరు మండలం బలివేకు చెందిన కడవకొల్లు మారేష్‌కి బాపులపాడు మండలం ఓగిరాలకు చెందిన చుక్క మ్మ (24)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్లు, ఐదు నెలలు వయసు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండో పాపకు బుధవారం అన్న ప్రాసన చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా మంగళవారం ఆటో తోలకానికి వెళ్లిన మారేష్ మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో మారేష్ కిరాయి డబ్బులు భార్యకిచ్చి ఆటో వేసుకుని వెళ్లి పోయాడు. సాయంత్రం అతను ఇంటికి తిరిగి వచ్చే సరికి భార్య చుక్కమ్మ ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉంది. ఐతే చుక్కమ్మ బంధువులు ఆమెది హత్య అని ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ దాసరి సుధ, రెవెన్యూ అధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్సై కుటుంబరావు మారేష్‌ను అదుపులోనికి తీసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించనున్నట్టు ఎస్సై తెలిపారు.