
సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు
పాలకొల్లు అర్బన్: దళిత క్రైస్తవుల రిజర్వేషన్లను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనందప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం గవర్నర్‌ని కలిసి వినతిపత్రం అందజేయడం పట్ల పాలకొల్లు నియోజకవర్గంలోని దళిత క్రైస్తవులు, పాస్టర్లు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కుంచిలపల్లి వినిస్టన్‌బాబు ఆధ్వర్యంలో పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా ఆనందప్రకాష్ మాట్లాడుతూ రాజ్యాంగంలో బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ మత స్వేచ్ఛ కల్పించారని, మతం మారితే కులం రిజర్వేషన్ మారదని చెప్పారు. పున్నయ్య, రంగనాథ్ కమిషన్లు సిఫార్సు చేసినా కేంద్రం రిజర్వేషన్లు అమలు చేయకుండా తాత్సారం చేసిందని ఆరోపించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో ఎస్సీ కమిషన్ కూడా అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందన్నారు. పెరిగిన జనాభా ఆధారంగా దళిత క్రైస్తవులకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ దళితులను అణచివేయడానికి కుట్ర పన్నుతోందని, దీనికి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ద్వారా రాష్ట్రంలో మత విధ్వేశాలను సృష్టిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎం మైఖేల్‌రాజు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కుంచిలపల్లి వినిస్టన్‌బాబు, వైస్ ఎంపీపీ యన్నాబత్తుల నాగేశ్వరరావు, కోఆప్షన్ సభ్యుడు తండా ఇస్సాక్‌రాజు, ఖండవల్లి వాసు, పీటర్‌సన్ చిన్నా, దేవ రాజేష్, రామాంజుల పెదమధు, పొనుకుమట్ల వీరాస్వామి, బళ్ల రాజశేఖర్, రాపాక సునిబాబు, నల్లి నాగరాజు, పాస్టర్లు పాల్గొన్నారు.
రెయిలింగ్‌ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు
ఉంగుటూరు: జాతీయ రహదారిపై ఉంగుటూరు టోలు ప్లాజా సమీపంలో నాచుగుంట టన్నెలు రెయిలింగ్‌ను ఏలూరు వైపు వెళుతున్న చిన్నకారు మంగళవారం సాయంత్రం ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న కొవ్వూరుకు చెందిన శనక్కాయల విశ్వేశ్వరరావు (76), శనక్కాయల రత్నమాల (74), చీమకుర్తి యామినిదేవి (56), చీమకుర్తి దివ్వశ్రీ (29)లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మహిళ కారు నడుపుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.