
కళాకారులకు బహుమతులు అందజేస్తున్న బుద్దాల రామారావు
తాడేపల్లిగూడెం : హాయ్.. హాయ్ నాయకా అంటూ మిన్నంటిన జయజయధ్వానాలు.. ఒక్కసారిగా కమ్ముకున్న పొగమేఘాలు వాటిమధ్య నుంచి నమోజనని, నమో మాత నమోనమో నామస్మరణతో ప్రత్యక్షమయ్యే ఘటోత్కచుడు. నాటకం చూస్తున్న ప్రేక్షకుల మోముల్లో ఒకింత ఆశ్చర్యం. ఆ వెంటనే సంబరం. ఇలా విజువల్ వండర్‌గా ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి బీవీఆర్ కళాకేంద్రంలో ప్రదర్శించిన వరంగల్ సాయిసం తోషి (సురభి) నాట్యమండలి వారి మాయాబజార్ నాటకం ఆకట్టుకుంది. మనోహర దృశ్యకావ్యాన్ని అద్భుతంగా వేదికపై ఆవిష్కరింపజేయడంలో సురభి సౌరభాల గుబాళింపు అచ్చెరువొందేలా చేసింది. ఈ నాటకాన్ని మూడు గంటల పాటు సినిమాటిక్స్‌ను మైమరపించేలా రక్తికట్టించారు. నిద్రావస్థ నుంచి మేల్కొనేవేళ ఘటోత్కచుని రాకను సూచించే సమయంలో వేదికపై డ్రాగన్ నోటి నుంచి మంటలను తీసుకొచ్చారు. అభిమన్యు, శశిరేఖ ప్రేమకేళీ విలాసాలలో నీరుచిమ్మే పౌంటెన్‌ను వేదికపై పెట్టి ఔరా అనిపించారు. ఓ చందమామా, నా చందమామా అంటూ విరహవేదనతో శశిరేఖ, అభిమన్యులు పడే ఆత్రుతకు లైటింగ్‌తో దృశ్యరూపం ఇచ్చారు. సంధ్యావందన వేళ పండులాంటి సూర్యుని ప్రేక్షకులు చూసిన భ్రాంతిని పొందారు. అభిమన్యు, ఘటోత్కచుని యుద్ధంలో బాణం, గదా యుద్ధం, మంటలు, వాటిని ఆర్పే వానను వేదికపైనే చూపించారు. ప్రేమవిహార రథాన్ని, నారధుని ఆకాశయానాన్ని ఆవిష్కరింపజేశారు. శశిరేఖ నిదిరిస్తున్న మంచం గాలిలో మాయం చేసి శహభాష్ అనిపించారు. ప్రతి సీనునూ పండించడంలో కళాకారులు పోటీ పడ్డారు. అలనాటి మేటి చిత్రరాజం మాయాబజార్ సినిమాను చూస్తున్నామా అనే భ్రాంతిని కలిగించారు. అలాగే.. గిటార్, ఫ్లూట్ వాయిద్య విన్యాసం, పీటీ వి.కృష్ణమాధురి గాన మాధుర్యం, ఏపీ జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు, జానపద చక్రవర్తి బిరుదాంకితులు ఎల్‌ఆర్ కృష్ణబాబు జానపద జావలీలు అలరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక నాటక పరిషత్‌ల అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు తదితరులు బీవీఆర్ కళాకేంద్రం సభ్యులు పాల్గొన్నారు.
అద్భుత దృశ్యంగా మాయాబజార్ మంత్రముగ్ధులైన ఆహూతులు