
తెల్లదోమ తెగులు ఆశించిన కొబ్బరి తోట
సాక్షి, భీమవరం : జిల్లాలో వరిసాగు తరువాత ఎంతో ప్రాధాన్యత గల కొబ్బరిసాగుకు తెల్లదోమ ఆశించి రైతులు అవస్థలు పడుతున్నారు. సర్పిలాకార తెల్లదోమ కారణంగా బూజు తెగులు నల్లని మసిలా వృద్ధిచెంది కొబ్బరి ఆకులు నల్లగామారి దిగుబడి తగ్గే ప్రమాదముంది. వేసవిలో ఎక్కువగా ఈ తెగులు వృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. తెల్లదోమ తెగులు నివారణకు జిల్లా వ్యాప్తంగా రైతులకు సదస్సులు నిర్వహించేందుకు ఉద్యానశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
37 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు
జిల్లా వ్యాప్తంగా 37 వేల ఎకరాల్లో ఉద్యాన సాగుచేస్తున్నారు. ఇందులో 20 వేల ఎకరాలకు పైగా కొబ్బరి సాగు ఉంది. పెట్టుబడి తక్కువ కావడంతో రైతులు పెరటిదొడ్లు, పుంతగట్లు, రహదారుల వెంబడి కొబ్బరి సాగు చేస్తున్నారు. కొబ్బరికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడంతో అనేక మంది రైతులు తోటలను సైతం పెంచుతున్నారు. కొబ్బరి ధర ఎలా ఉన్నా దిగుబడి బాగుంటే చాలని రైతులు భావిస్తారు. అయితే తెల్లదోమ వంటి తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెల్లదోమ లక్షణాలు
రసం పీల్చే జాతికి చెందిన తెల్లదోమను 2016 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గుర్తించారు. తెల్లదోమ చిన్న, పెద్ద రెక్కల పురుగులు ఆకుల అడు గు భాగాల్లో చేరి రసాన్ని పీల్చుతాయి. ఆకుల అడుగు భాగంలో తెల్లటి దూదివంటి పదార్థం కనిపిస్తుంది. సర్పిలాకర తెల్లటి వలయాకారంలో గుడ్లు విసర్జించే తేనేలాంటి జిగురు పదార్థంపై కాప్నోయం జాతికి చెందిన బూజు తెగులు నల్లని మసిలా వృద్ధి చెందుతుంది. జిగురు పదార్థం కింది ఆకులపై పడి నల్లటి మనిమంగుతో కిరణ జన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి ఆహారం తయారుచేసుకునే శక్తి సన్నగిల్లుతుంది. దీంతో కొబ్బరి దిగుబడి తగ్గిపోతుంది.
నివారణ పద్ధతులు
తెల్లదోమ ఆశించిన కొబ్బరితోటల్లో పురుగు మందులు పిచికారీ చేయకూడదు. తద్వారా సహజ శత్రువులైన పరాన్నజీవులు వృద్ధిచెంది తెల్లదోమలను నియంత్రిస్తాయి. పురుగుస్థాయి ఎక్కువగా ఉంటే అజాడిరక్టిన్ 10 వేల పీపీఎం మిల్లీలీటర్లను లీటరు నీరు లేదా ఐదు మిల్లీలీటర్ల వేప నూనె, రెండు గ్రాముల సర్ఫ్ కలిసి ఆకు అడుగు భాగం పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు ఉపయోగపడే పురుగులను ఉద్యానశాఖ సరఫరా చేస్తోంది. 200 పురుగులుండే డబ్బాను కేవలం రూ.40కు అందిస్తుంది. ఈ డబ్బాలు ఎకరాకు ఆరు డబ్బాలను కట్టాల్సి ఉంటుంది.
దిగుబడి తగ్గే ప్రమాదం
తెగులును అరికట్టేందుకు సదస్సులు
ప్రత్యేక శ్రద్ధతో తెగులు నివారణ
కొబ్బరిపై ఆశించే తెల్లదోమ నివారణకు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే యలమంచిలిలో కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాలతో అవగాహన కల్పించాం. తెల్లదోమ నివారణ పురుగులు అంబాజీపేటలో లభిస్తాయి. వాటిని రైతులు నేరుగా లేదా ఆర్‌బీకేల ద్వారా పొందవచ్చు. తెల్లదోమ వేసవిలో ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. రైతులు ప్రత్యేక శ్రద్ధతో నివారణ చర్యలు చేపట్టాలి.
– ఎ.దుర్గేష్, జిల్లా ఉద్యానశాఖాధికారి, భీమవరం
