ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి సహకార పరపతి సంఘం (సొసైటీ)లో అవినీతి జరిగి ఏడాది గడిచినా సొసైటీ కార్యదర్శి, ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం బాదంపూడి సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ పాలకవర్గ వార్షిక జనసభ జరుగుతుండగా బాదంపూడి, వెల్లమిల్లి రైతులు అడ్డుకున్నారు. సొసైటీకి తాళం వేసి రిలే దీక్ష చేపట్టారు. గతేడాది సొసైటీలో రుణాలు తీసుకున్న రైతులు వడ్డీతో సహా బకాయిలు చెల్లించినా.. బ్యాంకు అధికారుల నుంచి నోటీసులు రావడంపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. 250 మంది రైతులకు చెందిన సుమారు రూ.2.60 కోట్లు సొసైటీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు స్వాహా చేశారనే విషయం బయటపడింది. ఈ మేరకు విచారణ జరిగినా, సొసైటీ కార్యదర్శి, ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రైతులు మండిపడ్డారు. సొసైటీ అధ్యక్షుడు మల్లరెడ్డి శేషగిరి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ ఉద్యోగులు ఇలా మోసం చేస్తారని అనుకోలేదన్నారు.