
గాయపడిన వారితో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనాథ్, సీఐ కృష్ణకుమార్
సాక్షి, భీమవరం: భీమవరం పట్టణం దుర్గాపురంలోని బీవీ రాజు మార్గ్‌లో సోమవారం పాఠశాల విద్యార్థులతో వెళుతున్న ఆటో డివైడర్‌ను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులు, డ్రైవర్ గాయపడ్డారు. పాలకోడేరు, ఉండి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు సోమవారం ఉదయం భీమవరంలోని ఒక ప్రైవేటు పాఠశాలకు వస్తున్నారు. ఆటో బీవీ రాజు మార్గ్ వద్దకు వచ్చేసరికి మోటారుసైకిల్ అడ్డుగా రావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆటోలోని విద్యార్థులు, పుస్తకాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. డ్రైవర్ జి.ఆనందరావు, గొల్లలకోడేరు గ్రామానికి చెందిన విద్యార్థులు ఎస్ స్వర్ణవిశాల్, ఎస్ సువర్ణవికాస్, కె.మనోజ్ఞసాత్విక, కె.భార్గవి, పాలకోడేరుకు చెందిన పి.ప్రవీణ్, జి.సంజన గాయపడ్డారు. క్షతగాత్రులను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలలో చేర్పించారు. భీమవరం డీఎస్పీ బండారు శ్రీనాధ్, టుటౌన్ సీఐ బి.కృష్ణకుమార్ ఘటనా స్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు