
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలతోపాటు 15 ఏళ్ల వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు సామర్థ్య పరీక్షలో విఫలమైతే వాటినీ తుక్కుగా మార్చే విధానాన్ని కేంద్రం వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తేనుందని ఏలూరు ఉప రవాణా కమిషనర్ కె.శ్రీహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహనం ప్రారంభ నమోదు తేదీ నుంచి 15 ఏళ్లు దాటకుండా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయబడిన వాహనాలు కూడా వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేసి, వాటినీ తుక్కుకు తరలించాలని కేంద్రం సూచించందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాల వివరాలను తమ కార్యాలయానికి తెలపాలని కోరారు.
ఎర, బుట్టలతో పండు ఈగ నివారణ
నూజివీడు: మామిడిలో పండుఈగ బెడదను అరికట్టేందుకు ఎరలను, బుట్టలను ఎకరాకు ఐదు నుంచి ఆరు ఏర్పాటు చేసుకోవాలని మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బి.కనకమహాలక్ష్మి సోమవారం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పండుఈగ ఉధృతి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, ఇది కాయలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందని హెచ్చరించారు. మామిడి పరిశోధన స్థానంలో ఎర రూ.40, బుట్ట రూ.100 చొప్పున విక్రయిస్తున్నామని, రైతులు వీటి ద్వారా పండుఈగ బెడద నుంచి మామిడి కాయలను కాపాడుకోవచ్చని అన్నారు.