
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం
సాక్షి, భీమవరం: శాస్త్ర, పరిశోధన రంగాల్లో మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నందున విద్యార్థులు కోర్ గ్రూపులను ఎంచుకోవాలని భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.జగపతిరాజు సూచించారు. కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన సంకేత జాతీయస్థాయి విద్యార్థి సింపోజియం ముగింపు సందర్భంగా సోమ వారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. భారత అంతరిక్ష పరిశోధన, రక్షణ రంగంలో వినూత్న పరికరాల రూపకల్పనలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రపంచం గర్వించదగ్గ రీతిలో ఇస్రో నిర్వహిస్తున్న రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో ఇంజనీరింగ్ గ్రూప్ నిపుణులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ప్రయోగాలు.. వాటి ఫలితాలపై నిరంతరం విశ్లేషణ జరిపి ఆ రంగంలో ప్రావీణ్యం సంపాదించేందుకు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. సంకేత కన్వీనర్ సీహెచ్ రామబద్రిరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో కోర్ గ్రూపులన్నింటికీ ఉపయోగపడే విధంగా మల్టీ డిసిప్లినరీ వర్క్‌షాప్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్‌చార్జి హెడ్ డాక్టర్ కె.సురేష్ బాబు మాట్లాడుతూ సంకేత కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో గల ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు హాజరుకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పోటీల్లో విజేతలకు జగపతిరాజు చేతుల మీదుగా నగదు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందించారు.