రాతతో ఆకట్టు.. మార్కులు రాబట్టు | - | Sakshi
Sakshi News home page

రాతతో ఆకట్టు.. మార్కులు రాబట్టు

Mar 28 2023 12:40 AM | Updated on Mar 28 2023 12:40 AM

పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు (ఫైల్‌)  - Sakshi

పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు (ఫైల్‌)

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చేతిరాత తలరాతలను కూడా మార్చుతుందనేది నానుడి. అందుకే దస్తూరిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచిస్తుంటారు. ఇందుకోసం కాపీ పుస్తకాలను కూడా రాయిస్తుంటారు. పొందికై న అక్షరాలు, ఒద్దికగా ఒక పద్ధతిలో రాసే రాతకు ఎప్పటికీ తగిన విలువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో చేతిరాతను బట్టి కూడా మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దస్తూరిపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. అర్థంకాని విధంగా రాస్తే కొన్ని మార్కులు కోల్పోయి ఉత్తీర్ణతపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అక్షరాలు పొందికగా ఉంటే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు సదరు జవాబుపత్రంపై సానుకూల దృక్పథం కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని అంశాలను అనుసరించాలని సూచిస్తున్నారు.

ఈ పొరపాట్లకు దూరంగా ఉండండి..

చాలా మంది విద్యార్థులు పరీక్షల సమయంలో కంగారు పడుతూ ఉంటారు. కొంతమంది జవాబులను ఆలోచించడానికి సమయం ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల జవాబులు రాయడానికి సమయం సరిపోదు. ఆ కంగారులో గజిబిజిగా రాసి మూల్యాంకనం చేసేవారికి పరీక్ష పెడతారు. అది వారి మార్కులపై ప్రభావం చూపుతుంది. చూడగానే ఆకట్టుకునేలా లేకపోతే విద్యార్థి సరైన సమాధానం రాసినా అది అర్థం కాక మార్కులు వేయరు. మరికొంతమంది పెన్నును ఒత్తిపట్టి రాస్తారు. దీనివల్ల పేజీకి రెండోవైపు కూడా కనిపించి మార్కులు వేసే వారికి ఇబ్బందిగా ఉంటుంది.

ఇంకొంతమంది పెన్నును వేళ్లతో బిగించి పట్టుకుంటారు. దీనివల్ల కొద్దిసేపు రాసిన తరువాత వేళ్లు నొప్పిగా అనిపించి రాసే వేగం తగ్గిపోతుంది. గణితం పేపర్‌లో కొంతమంది అంకెలను సరిగా వేయరు.. 2 అంకెను ఇంగ్లీస్‌ జెడ్‌లా, 5 అంకెను ఇంగ్లీష్‌ ఎస్‌లా, 6 అంకెను 8లా రాసేస్తుంటారు. అది కూడా మార్కులు తగ్గిపోవడానికి కారణమౌతుంది. ఇటువంటి చిన్నచిన్న పొరపాట్లను సరిదుద్దుకుంటే పరీక్షలో మరిన్ని మార్కులు రాబట్టే అవకాశం ఉంటుంది.

అందమైన దస్తూరి కోసం.. నిపుణుల సూచనలివీ..

ప్రతిరోజూ కొద్దిసేపు చేతిరాతపై సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చు.

పెన్‌ టిప్‌ను దూరంగా పట్టుకుని రాసే అక్షరాలు గుండ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది.

జవాబులను సూటిగా రాయాలి.

మనం రాసే తీరు పేపర్‌ దిద్దేవారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు.

దిద్దుబాటు, గజిబిజి ఉండకూడదు. పదానికి, పదానికి మధ్య దూరం ఉండాలి.

ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయడానికి ఉపక్రమించాలి.

జవాబు పత్రాల్లో పేజీకి 15 లేదా 16 లైన్లు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

పేజీకి పైన, కింద మార్జిన్‌ విడిచిపెట్టాలి.

మొదటి వరుసలో ఎంత బాగా రాశారో చివరి వరకు అదే దస్తూరి వచ్చేలా చూసుకోవాలి.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ సబ్జెక్టుల్లో లెటర్‌ రైటింగ్‌ ఒకే పేజీలో వచ్చేలా రాసేందుకు ప్రయత్నించాలి.

గణితంలో అంకెలు స్పష్టంగా ఉండాలి. కొట్టివేతలు వస్తే మార్కులు తగ్గే అవకాశముంటుంది.

గ్రాఫ్‌ గీసే సమయంలో సైతం అప్రమత్తంగా వ్యవహరించాలి.

సైన్సులో బొమ్మలు గీసే సమయంలో కష్టమైన వాటిని వదిలి సులభంగా ఉన్నవాటిని ఆకర్షణీయంగా గీయాలి.

సాంఘిక శాస్త్రం సబ్జెక్టులో సమాధానాలు పాయింట్ల వారీగా రాయాలి. శీర్షికలు, ఉపశీర్షికల కింద అండర్‌లైన్‌ చేయాలి.

దస్తూరికీ మార్కులు పడతాయంటున్న నిపుణులు

కొద్దిరోజుల సాధనతో సాధ్యమని వెల్లడి

సమయపాలనకూ సాధన తోడ్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement