
భీమవరం అర్బన్: బంగాళాఖాతంలో అల్పపీడన ఆవర్తనం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలని భీమవరం మత్స్యశాఖ ఏడీ ఎల్‌ఎల్‌ఎన్ రాజు సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో చేపలు, 40 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల పెంపకం చేస్తున్నారని, ఉష్ణోగ్రతలు తగ్గి శీత గాలులు వీయడం వల్ల చెరువుల్లో పీహెచ్ శాతం తగ్గిపోతుందన్నారు. ఎకరానికి 25 కిలోల అగ్రికల్చర్ లైమ్ చల్లాలని, చెరువుల్లో ఏరియేటర్లు పెంచాలని సూచించారు. ఆక్సిజన్ శాతం పెంచేందుకు ఆక్సిజన్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మబ్బుల వల్ల రొయ్యలు మేత తిన డం తగ్గిస్తాయని, చెక్ ట్రేలలో మేత వేసి అవసరమైన మేరకు అందించాలన్నారు. చెరువులు చల్లబడితే రొయ్యలకు వైట్‌స్పాట్, విబ్రియో, బ్యాక్టీరి యా సోకడం, చేపలకు తాటాకు, ఎర్రమచ్చ తెగులు సోకడం, పేను పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
మత్స్యశాఖ ఏడీ రాజు సూచన