షార్ట్‌ సర్క్యూట్‌తో షాపు దగ్ధం

ఏలూరు టౌన్‌: ఏలూరు నగరంలోని వన్‌టౌన్‌ మార్కెట్‌లో ఉన్న పవన్‌ ట్రేడర్స్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నూనె గానుగల సమీపంలో రెడ్డి అనే వ్యక్తి పవన్‌ ట్రేడర్స్‌ పేరుతో ప్లాస్టిక్‌ దుకాణాన్ని మూడంతస్తుల భవనంలో నిర్వహిస్తున్నాడు. యథావిధిగా సిబ్బంది శుక్రవారం రాత్రి తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పవన్‌ ట్రేడర్స్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మూడంతస్తుల్లో మంటలు వేగంగా వ్యాపించాయి. అందులో ఉన్న ప్లాస్టిక్‌ సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top