వెలుగు నీడలో.. నకిలీ సంఘాలు

నిడమర్రు వెలుగు కార్యాలయం  - Sakshi

నిడమర్రు : పేద, మధ్యతరగతి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించి ఆయా కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు వైఎస్సార్‌ క్రాంతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలోని స్వయం సహాయక సభ్యులకు ప్రభుత్వం అందించే బ్యాంకు రుణాల విషయంలో నిడమర్రు మండలంలోని పలు గ్రామాల్లో అవకతవకలు జరిగినట్టు తాజాగా బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ), కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ (సీసీ), వెలుగు కార్యాలయ సిబ్బంది బ్యాంకు అధికారులతో కుమ్మకై ్క నకిలీ స్వయం సహాయక సంఘాలను సృష్టించి ఆయా సంఘాల పేరుతో బ్యాంకు రుణాలు మంజూరు చేసుకున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం ఇద్దరు సీసీల నగదు లావాదేవీలతో బయటికి పొక్కింది. గతంలో మండలంలో ఇటువంటి నకిలీ సంఘాల పేరుతో బ్యాంకు రుణాలు తీసుకున్న విషయం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకు సిబ్బందికి తెలిసినా విషయం బయటకు రాకుండా గుట్టుగా ఉంచి.. బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం సొమ్మును అవకతవకలకు పాల్పడినవారు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం బయటకు రాలేదు. తాజాగా బువ్వనపల్లిలో వీవోఏల మధ్య తలెత్తిన వివాదంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు పొక్కింది.

2018 నుంచే 16 నకిలీ సంఘాలు

ఒక్క బువ్వనపల్లి గ్రామంలోనే 2018 నుంచి సంతకాలు ఫోర్జరీ చేసి 16 నకిలీ సంఘాలను సృష్టించి గణపవరంలోని ఓ బ్యాంకు బ్రాంచి నుంచి రుణాలు తెచ్చుకుని దర్జాగా అధిక వడ్డీ వ్యాపారాలు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘాల్లో ఒకటి గత ఏడాది వాయిదాలు కట్టకపోవడంతో బ్యాంకు అధికారుల విచారణలో నకిలీ సంఘాల పేరుతో రుణాలు తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ నకిలీ సంఘాలను సృష్టించింది ప్రస్తుతం వివాదం నెలకొన్న వీవోఏల్లో మాజీ అని తెలుస్తోంది. 2022 అక్టోబరులో తన పోస్టుకు రాజీనామా చేసిన సదరు వీవోఏ తనకు గౌరవ వేతనం కింద రావాల్సిన నగదు కోసం అధికారులను ఆశ్రయించింది. ఆమె స్థానంలో చేరిన కొత్త వీవోఏ ఖాతా నుంచి ఈ సొమ్మును తీసుకోవడంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాజీ వీవోయేనే మొత్తం 16 నకిలీ గ్రూపులు నిర్వహించి బ్యాంకు రుణాలు తీసుకోవడం గమనార్హం. ఇంకా నాలుగు నకిలీ గ్రూపులు రుణాల మంజూరు కోసం పెండింగ్‌లో ఉన్నట్టు ఆమె ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారం గత ఏపీఎం సహకారంతో జరిగినట్టు తెలుస్తోంది.

నకిలీలు కొనసాగడానికి కారణం ఇదీ..

ఈ నకిలీలు కొనసాగడానికి కారణం ఒక సభ్యురాలు రెండు మూడు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నా.. వారిని బ్యాంకు అధికారులు గుర్తించకపోవడమేనని తెలుస్తోంది. ఆధార్‌ కార్డు సంఖ్య ఆధారంగా వీరిని బ్యాంకు సిబ్బంది గుర్తించే అవకాశం ఉన్నా వారికి తెలిసీ.. తెలియనట్టు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అంతటా ఇలాంటి నకిలీ గ్రూపులు ఉంటాయని, వాటిపై అధికారులు దృష్టిసారిస్తే మరిన్ని సంఘాల బాగోతం వెలుగులోకి వస్తుందని తెలుస్తోంది.

ఫేక్‌ సంఘాల బ్యాంకు ఖాతాలతో డ్వాక్రా రుణాలు

వీవోఏల మధ్య వివాదంతో బహిర్గతం

తెలిసినా గోప్యంగా ఉంచిన జిల్లా అధికారులు

గత ఏపీఎం, బ్యాంకు అధికారులపై ఆరోపణలు

పూర్తిస్థాయి విచారణ చేస్తే మరిన్ని సంఘాల బాగోతం వెలుగులోకి !

నకిలీలను గుర్తించే పనిలో అధికారులు

బువ్వనపల్లిలో గత ఏడాది జూలై 21న కొత్త గ్రూప్‌ క్రియేట్‌ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఒకేరోజు పొదుపు నగదు రూ.40 వేలు కట్టడంతో అనుమానం వచ్చి పరిశీలించగా నకిలీగా తేలింది. సంబంధిత రికార్డులు వెలుగు కార్యాలయంలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మండలంలో ఇలా ఏ గ్రామంలో నకిలీ సంఘాలు ఉన్నాయో వాటిపై దృష్టి పెట్టినట్టు నిడమర్రు వెలుగు ప్రాజెక్టు ఏపీఎం జి.రాజ్యశ్రీ తెలిపారు. తాను ఏపీఎంగా మండలానికి వచ్చి రెండేళ్లవుతోందని, పూర్తిస్థాయి అవగాహన కోసం తనిఖీలు చేస్తున్నానని ఆమె చెప్పారు.

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top