రేపటి నుంచి
ప్రత్యేకాధికారి పాలన
ముగియనున్న జీడబ్ల్యూఎంసీ సభ్యుల పదవీకాలం
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల పదవీ కాలం నేడు ముగియనుంది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ చివరి సమావేశం నిర్వహించనున్నారు. ఐదేళ్ల చివరి రోజు వీడ్కోలు వేళ చివరి కౌన్సిల్ నిర్వహించడంపై సభ్యుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసమావేశంలో డివిజన్‌కు రూ.50 లక్షల నిధుల కేటాయింపులు, పరిపాలన, ఆర్థిక స్వావలంబన కోసం మరికొన్ని కీలక నిర్ణయాలు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. సమావేశంలో ఎజెండా అంశాలను అంత్యంత గోప్యంగా ఉంచారు.
తారుమారు..
2021 మే 2న ఓట్ల లెక్కింపు జరిగింది. 2021 మే 7 పాలక మండలి కొలువుదీరింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 66 డివిజన్లకు బీఆర్‌ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాఽ దించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మేయర్ సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్ ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో గ్రేటర్‌లోనూ రాజకీయ పరిణామాలు తారుమారయ్యాయి. మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పలువురు కార్పొరేటర్లు ఆమెను అనుసరించారు. దీంతో కౌన్సిల్‌లో బలాబలాలు మారిపోయాయి. కాంగ్రెస్ సభ్యులు 34 మంది కాగా, బీఆర్‌ఎస్–21, బీజేపీ 11కు సంఖ్య చేరింది. మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు అడుగు ముందుకేసినా బెడిసికొట్టింది. ఈనేపథ్యంలో మేయర్, డిప్యూటీలు పదవుల్లో కొనసాగారు. కౌన్సిల్‌లో కో–ఆప్షన్ సభ్యుల ఉసేలేదు. ఎంతో మంది రాజకీయ నాయకులు ఆ పదవులు కోసం ఎదురు చూసి విసిగివేసారిపోయారు. వార్డు కమిటీల జాడ పత్తా లేకుండా పోయింది.
ఎప్పుడెప్పుడు ఎవరంటే!
వరంగల్ బల్దియా 1994లో మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటైంది. ఏడాది పాటు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగింది. 2000 సంవత్సరంలో ఏడాది, 2005లో మూడు నెలలు కొనసాగింది. మళ్లీ 2010 సెప్టెంబర్ 30న అప్పటి పాలకవర్గం గడువు ముగిసింది. దీంతో 2010 అక్టోబర్ 1 నుంచి అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. అదే ఏడాది నవంబర్ 30న కలెక్టర్ శ్రీధర్ బదిలీ అయ్యారు. అతడి స్థానంలో వచ్చిన రాహుల్‌బొజ్జా ఐదుసార్లు ప్రత్యేకాధికారిగా పనిచేసి రికార్డు సృష్టించారు. 2014లో కలెక్టర్‌గా కిషన్ బదిలీపై వచ్చారు. సుమారు ఏడాదిన్నర పాటు పనిచేసి కిషన్ బదిలీ కావడంతో వాకాటి కరుణ 2015 జనవరిలో ఇక్కడికి వచ్చారు. కలెక్టర్‌గా, ప్రత్యేకాధికారిగా కొనసాగారు. 2016 మార్చి 15 నుంచి ఐదేళ్ల పాటు పాలక వర్గం కొనసాగింది. 2021 మార్చి 15న మళ్లీ స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హన్మంతు 51 రోజులు కొనసాగారు. తాజాగా మరో మారు ఈనెల 7 నుంచి ప్రత్యేకాధికారి పాలన ఆరంభం కానుంది. ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగకపోతే మరోమారు పొడిగించే అవకాశాలుంటాయి. ఈలోగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.
అవినీతి, ఆరోపణలు, పట్టింపులేమితో గడిపిన కొందరు కార్పొరేటర్లు
ఐదేళ్లలో 22 కౌన్సిల్ సమావేశాలు
మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నేడు చివరి సమావేశం
జీడబ్ల్యూఎంసీలో గురువారం నుంచి ప్రత్యేక అధికారి పాలనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. హనుమకొండ కలెక్టర్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాగా, ఇప్పటివరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదు.
అభివృద్ధి అంతంతే..
ఎన్నికల సమయంలో పార్టీపరంగా వ్యక్తిగతంగా అనేక హామీలు ఇచ్చారు. కానీ, ఐదేళ్ల వ్యవధిలో ఆశించిన మేరకు పనులు చేపట్టలేకపోయారు. నగరంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం మినహా వెలగని వీధిలైట్లు, కోతులు, కుక్కలు, పందులు, దోమల కాట్లు వంటి చిన్న, చిన్న సమస్యల పరిష్కారానికి కూడా కార్పొరేటర్లు చొరవ చూపలేదనే ఆరోపణలున్నాయి. సమస్యల ప్రస్తావనకు వేదికై న కౌన్సిల్ సమావేశంలో మాట్లాడేందుకు పెద్దగా అవకాశం లభించకపోవడమే సమస్యలు అపరిష్కృతంగా ఉండడానికి కారణంగా సభ్యులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల పదవీకాలంలో నెలకు ఒకటి చొప్పున 60 సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా.. కేవలం 22 మాత్రమే నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అనుమతి లేని భవనాలు, అనుమతి ఉన్నా.. నిబంధనల పేరుతో 90 శాతం మంది కార్పొరేటర్లు పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను, చైన్‌మెన్లను పావులుగా వాడుకుని అక్రమార్జనకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. అభివృద్ధి పనుల్లో 4 శాతం కమీషన్లు తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. కాలనీల్లో వివాదాస్పద భూముల్లో తలదూర్చడం ఎంతో కొంత ముట్టజెప్పి కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.


