అశోక్‌నగర్‌లో శివాలయం కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

అశోక్‌నగర్‌లో శివాలయం కూల్చివేత

May 6 2026 7:37 AM | Updated on May 6 2026 7:37 AM

కాంట్రాక్టర్‌పై స్థానికుల ఆగ్రహం

ఖానాపురం: మండలంలోని అశోక్‌నగర్‌లో కాకతీయుల నాటి శివాలయాన్ని కూల్చివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు చేసింది. ఇందుకోసం అశోక్‌నగర్‌లోని 30 ఎకరాల శివాలయ స్థలాన్ని కేటాయించారు. ఈక్రమంలో నెల రోజులుగా కాంట్రాక్టర్‌ స్థలం చదును పనులు చేస్తున్నాడు. శివాలయం చుట్టూ ఉన్న మట్టికోటను కొంతమేర తొలగించారు. కోటలోని ఆలయాన్ని తొలగించకూడదని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మట్టికోటలో ఉన్న శిథిలావస్థకు చేరిన పురాతన శివాలయాన్ని సోమవారం పూర్తిగా కూల్చివేశాడు. ఆలయాన్ని కూల్చాలంటే పురావస్తు శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా ఆలయాన్ని కూల్చివేశాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈవిషయమై తహసీల్దార్‌ నంగునూరి రమేశ్‌ను వివరణ కోరగా కోటలోని మొక్కలు తొలగించారని, పనులు నిలిపివేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement