ఘనంగా సంకటహర చతుర్థి పూజలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సంకటహర చతుర్థి పూజలు

May 6 2026 7:37 AM | Updated on May 6 2026 7:37 AM

ఘనంగా సంకటహర చతుర్థి పూజలు ‘మాజీ వీసీ డైనమిక్‌’ మూగజీవాలను తరలిస్తే చర్యలు: సీపీ

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌ ఆధ్వర్యంలో ఉత్తిష్ట గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

కేయూ క్యాంపస్‌: కేయూలో మాజీ వీసీ, ఎకనామిక్స్‌ విభాగం విశ్రాంత ఆచార్యులు ఎన్‌.లింగమూర్తి డైనమిక్‌ నిర్ణయాలు తీసుకునేవారని రాష్ట్ర శాసన మండలి వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌ అన్నారు. మంగళవారం కేయూ, జయశంకర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ దివంగత ఎన్‌.లింగమూర్తి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లింగమూర్తి చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం, కేయూ రిటైర్డ్‌ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎ.సదానందం, జనరల్‌ సెక్రటరీ వడ్డె రవీందర్‌, అకుట్‌ అధ్యక్షుడు బి.వెంకట్రామ్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

హసన్‌పర్తి: మూగ జీవాలను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ హెచ్చరించారు. మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్‌ కమిషనరేట్‌ పరిధి గో రక్షణ కమిటీలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన ఈ సమావేశంలో మూగజీవాల అక్రమ రవాణా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కమిషనరేట్‌ సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తామన్నారు. గోవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. గోవులను రక్షించాలనే క్రమంలో రక్షణ కమిటీ సభ్యులు చట్టాలను అతిక్రమించొద్దన్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను వెంబడిస్తూ వేగంగా వాహనాలను నడపడం చాలా ప్రమాదకరమని సూచించారు. మూగజీవాలను అడ్డుకునే క్రమంలో నిందితులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సూచించారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్‌, రాజమహేంద్రనాయక్‌, దార కమిత, ట్రెయినీ ఐపీఎస్‌ మనీష, నేహ్రా, ఏసీపీలు జీతేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, భీం శర్మ, సతీశ్‌బాబు, రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement