పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ కార్యకలాపాలు సమర్థవంతంగా సాగేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారదతో కలిసి డెయిరీ అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ యూనిట్లు (బీఎంసీయూలు) ఏర్పాటు చేసి వాటి ద్వారా పాల సేకరణ ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం నాలుగు బీఎంసీయూలు ఏర్పాటు చేసి డెయిరీ కార్యకలాపాలు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పాల సేకరణతో పాటు మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేసి, అవసరమైన హెచ్‌ఆర్ సిబ్బంది నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్పత్తుల విక్రయానికి ఔట్‌లెట్ పాయింట్లు గుర్తించాల్సిందిగా సూచించారు. సంగెం మండలంలో బీఎంసీయూ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నందున ముందుగా అక్కడే కార్యకలాపాలు ప్రారంభించాలని తెలిపారు. డెయిరీకి పాలు సరఫరా చేసే మహిళలకు వారంపాటు నివాస శిక్షణ (రెసిడెన్షియల్ ట్రైనింగ్) ఇవ్వాలని, బ్యాచ్ వారీగా జాబితాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో హనుమకొండ, వరంగల్ డీఆర్డీఓలు మేన శ్రీను, నాగ పద్మజ, వరంగల్ జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎం సరిత పాల్గొన్నారు.


