వరంగల్ అర్బన్: సజావుగా తాగునీటిని అందించలేని దైన్యం మన ఇంజనీర్లు, పాలకులది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు రూ.వంద కోట్లకుపైగా నీటి వ్యాపారం అక్రమంగా చేస్తున్నా ప్రభుత్వం నియంత్రించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరంలోని కాలనీలు, శివారు ప్రాంతాల్లో అడ్డాగా సాగుతున్న ఈ అక్రమ దందాకు ప్రజాప్రతినిధులు, గ్రేటర్ వరంగల్, ఆహార కల్తీ నియంత్రణ శాఖ, రెవెన్యూ శాఖల అధికార యంత్రాంగం అండదండలు ఉంటున్నాయని విమర్శలున్నాయి. ఖాళీ స్థలాలు, ప్లాట్లలో బోర్లు వేసి భూగర్భ జలాలను విచ్చలవిడిగా లాగేస్తున్నారు. ఈ దందాతో పలు కాలనీల్లో బోర్లకు నీళ్లు రావడం లేదని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. వేసవి వచ్చిందంటే చాలు నగరవాసుల అవసరాలు రెండింతలు అవుతున్నాయి. ఫలితంగా అక్రమ నీటి వ్యాపారాలు మూడు మూడు ప్లాంట్లు, ఆరు క్యాన్లు అన్నట్లుగా కొనసాగుతోంది.
ప్యూరిఫయర్ పేరుతో..
నల్లా నీళ్ల మీద నమ్మకం లేదు. ఇంట్లోని వాటర్ క్యాన్ పట్టుకొని సమీపంలో ఉన్న ప్లాంట్‌కు వెళ్లి రూ.10 ఇచ్చేసి నీళ్లను తెచ్చుకుంటున్నారు. మరొకొందరు ట్రాలీ ఆటోలకు సమాచారం అందించి క్యాన్‌కు రూ.20 చెల్లించి నీటిని నింపుకుంటున్నారు. కూల్ వాటర్ క్యాన్‌ను రూ.30 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆ నీరు శుద్ధి చేసిందా లేదా? అని పట్టించుకోవడం లేదు. తాగేందుకు ఉపయోగపడుడుతుందా? అని ఎవరూ పరిశీలించడం లేదు. బోరు నుంచి తోడుతున్న నీళ్లను నేరుగా ఫిల్టర్ మిషన్‌లోకి పంపుతున్నారు. తాగునీటి శుద్ధీకరణ అయి పోయిందని చెప్పి స్టీల్ ట్యాంకులోకి వస్తున్నాయి. అక్కడి నుంచి నేరుగా వినియోగదారుడికి వాటర్, కూల్ క్యాన్లలో నింపుతున్నారు. కొన్ని మినరల్స్‌ను ఉపయోగిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో వాటర్ బాటిళ్ల తయారీ యఽథేచ్ఛగా సాగుతోంది. హోల్‌సేల్‌గా వాటర్ బాటిల్‌ను రూ.5 నుంచి 9 అమ్ముతున్నారు. వ్యాపారులు రిటైల్ ధర రూ.20కి అమ్ముతున్నారు. వాటర్‌ప్లాంట్ అనుమతి తీసుకోవాలంటే తప్పనిసరిగా బీఐఎస్ అనుమతి ఉండాలి. ఏడాదికోమారు రెన్యువల్ చేసుకోవాలి. రూ.1.20 లక్షల ఫీజు చెల్లించాలి. విశాలమైన గదుల్లో హెచ్‌డీపీ పైపులైన్ ఏర్పాటు చేసి, నీటి ట్యాంకులు, ఇతర సామగ్రి నాణ్యమైనవి ఉండాలి. ట్రస్టీలు, స్వయం సహాయక సంఘాలు, ఇతర సామాజిక వర్గాల పేరు చెప్పి వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనలను గాలికి వదులుతున్నారు.
అనుమతి ఉన్నవి 30 మాత్రమే..
గ్రేటర్ వరంగల్‌లో సుమారు 5 వేల ప్లాంట్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది నిబంధనలను గాలికి వదిలి.. నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండర్డ్స్ కార్యాలయంలో హైదరాబాద్‌లో ఉంది. ఆ విభాగం అధికారులు వీటిని ఏ మాత్రం పట్టించుకోరు. యథేచ్ఛగా వాల్టా (వాటర్ ల్యాండ్ ట్రీ యాక్ట్)ను ఉల్లంఘిస్తూ బోర్లు వేస్తున్నా తహసీల్దార్లు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. జల గరళాన్ని అమ్ముతున్నా కార్పొరేషన్ ప్రజారోగ్యం, ఆహార కల్తీ నియంత్రణ, జిల్లా ఉన్నతాధికారులు అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో నగరంలో మినరల్ మాఫీ హవా కొనసాగుతోంది. ట్రేడ్‌లైసెన్స్, బీఐఎస్ (ఐఎస్‌ఐ) అనుమతి ఉన్న ప్లాంట్లు 30 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి నాన్ ఐఎస్‌ఐ ప్లాంట్లే. అనుమతి లేని వాటర్‌ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
నల్లా నీటిని కాగబెట్టి తాగాలి..
నల్లా నీళ్లు శుద్ధి చేసినవి. నీళ్లను కాగబెట్టి చల్లారిన తర్వాత వడబోసుకొని తాగాలి. క్యాన్ వాటర్ నీళ్లను తాగితే మోకాళ్ల నొప్పులు వస్తాయి. వాటర్ ప్లాంట్లలో నిబంధనలు పాటించడం లేదు. ఆహార కల్తీ నిరోధక శాఖ, రెవెన్యూ, గ్రేటర్ కలిసి దాడులు చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.
– రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్‌ఓ
గ్రేటర్‌లో యథేచ్ఛగా వాటర్‌ప్లాంట్ల ఏర్పాటు
నిబంధనలు ఉల్లంఘించి
దర్జాగా వ్యాపారం
ఏటా రూ.వంద కోట్లకుపైగా
లావాదేవీలు
వ్యాధులబారిన ప్రజలు..
పట్టించుకోని అధికారులు


