అక్రమ నిర్మాణాలపై పట్టింపులేదా? | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలపై పట్టింపులేదా?

May 5 2026 9:37 AM | Updated on May 5 2026 9:37 AM

అక్రమ నిర్మాణాలపై పట్టింపులేదా?

వరంగల్‌ అర్బన్‌: ‘అనధికారిక, అక్రమ భవన నిర్మాణాల ఫిర్యాదులపై అధికారులకు, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి పట్టింపు కరువైంది’ అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు మొత్తం 88 ఫిర్యాదులు రాగా, టౌన్‌ ప్లానింగ్‌కు 48, ఇంజనీరింగ్‌కు 13,రెవెన్యూ 11, హెల్త్‌ –శానిటేషన్‌కు 8, నీటి సరఫరాకు 8 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో బల్దియా అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్‌ సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● కేయూ గేట్‌–2లో డ్రెయినేజీ స్తంభించిపోయిందని, ఇంటి లైన్‌లో డ్రెయినేజీ నిర్మించాలని అనిల్‌కుమార్‌ కోరారు.

● 15వ డివిజన్‌ గొర్రెకుంటలో వీధిలైట్లు వెలగడం లేదని, దొంగతనాలు జరుగుతున్నాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, లైట్లు ఏర్పాటు చేయాలని ఎస్‌.రవి ఫిర్యాదు చేశారు.

● 1వ డివిజన్‌ పలివేల్పుల మురికి కాల్వలను పూడ్చేసి, అక్రమంగా కబ్జా చేశారని చర్యలు తీసుకోవాలని కాలువ రాజయ్య పేర్కొన్నారు.

● శివనగర్‌లో తాగునీటి సమస్య జఠిలంగా ఉందని పరిష్కరించాలని బీజేపీ పార్టీ ఖిలా వరంగల్‌ మండల అధ్యక్షుడు మహ్మద్‌ రఫీ వినతి పత్రం అందించారు.

● బక్రీద్‌ దగ్గర పడుతోందని దర్గా, ఈద్గాల్లో కనీస వసతులు కల్పించాలని మహ్మద్‌ అబ్దుల్‌ ఖాలీద్‌ తన్వీర్‌ కోరారు.

● 1వ డివిజన్‌ పెగడపల్లిలో ఇళ్ల మధ్యలో కోళ్ల ఫాం ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నామని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

● రంగశాయిపేట 19–9–449/2 ఇంటికి రెండు నల్లాలు ఉన్నాయని, ఒకదాన్ని తొలగించాలని దొడ్డ శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు.

● 8వ డివిజన్‌ 3–7–114/1 మురుగునీరు స్తంభించిందని చర్యలు తీసుకోవాలని కొమురయ్య పేర్కొన్నారు.

● హనుమకొండ గోపాలపురంలో సీసీ రోడ్డు, డ్రె యినేజీ నిర్మించాలని, బల్దియాకు రూ.50 వేలు గతేడాది కిందట చెల్లించామని ఇంత వరకు ఏర్పాటు చేయలేదని శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు.

● హనుమకొండలోని కుమార్‌పల్లిలో పలు ఇళ్లకు సెప్టిక్‌ ట్యాంకు లేదని, మోరీలోకి మల, వ్యర్థాలను వదులుతున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

● హనుమకొండ కాకతీయ కాలనీ–2లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని అభివృద్ధి కాలనీ కమిటి ప్రతినిధులు విన్నవించారు.

● 31, 10వ డివిజన్‌లోని మారుతి హిల్స్‌లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఆక్రమణలకు గురవుతున్నాయని చర్యలు తీసుకోవాలని కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

● 18వ డివిజన్‌ టీఆర్టీ కాలనీలో విద్యుత్‌ స్తంభాలు, డ్రెయినేజీలు, నల్లా పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌ సెల్‌లో ప్రజల ఆవేదన

88 వినతులు స్వీకరించిన అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement