స్టిక్కరేసి.. నొక్కేసి! | - | Sakshi
Sakshi News home page

స్టిక్కరేసి.. నొక్కేసి!

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

క్యూఆర్‌ కోడ్‌ పేరుతో దందా

ఖిలా వరంగల్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనానికి ముందు, వెనుక రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు అతికించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి వెళ రోడ్డు పక్కన వాహనాలు నిలిపినప్పుడు వాహనదారులు గుర్తించే వీలుంటుంది. కాగా, సాధారణ స్టిక్కర్ల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్టిక్కర్లు వేయాలని దాదాపు రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారుల నుంచి అడ్డగోలుగా వసూళ్లకు పాల్ప డడం అనుమానాలకు తావిస్తోంది.

ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు..

వాహనాలకు క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న స్టిక్కర్లను అతికించే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ, భూపాలపల్లి, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలోనే ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు సంబంధించిన సిబ్బంది లారీలతోపాటు ఇతర వాహనాలకు క్యూ ఆర్‌ కోడ్‌ కలిగిన రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లను అతికిస్తున్నారు. మార్చి 25న ఫిట్‌నెస్‌కు వచ్చే వాహనాలకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్యూ ఆర్‌ కోడ్‌ స్టిక్కర్లను లారీకి అంటిస్తే రూ.1500 నుంచి రూ.3 వేల వరకు, అసలే స్టిక్కర్లు లేని వాహనానికై తే రూ.6,500 వసూలు చేయడంతో ఓనర్లపై అదనపు భారం పడుతోంది.

బిల్లు ఇవ్వరు..

ఇంతకాలం ఫిట్‌నెస్‌ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే లారీకి రూ.300ల నుంచి రూ.500లోపు వసూలు చేసి రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు వేసేవారు. ప్రస్తుతం లారీలకు స్టిక్కర్లు ఉన్నప్పటికీ క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్‌ వేసి బిల్లు చేతిలో పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. స్టిక్కర్‌ వేస్తే ఫిట్‌నెస్‌ క్రమ బద్ధీకరణ కోసం కార్యాలయానికి వచ్చే వాహనాలకు మొదట స్టిక్కర్లు వేసిన తర్వాతే అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. స్టిక్కర్ల సైజు ఎంత..? వసూలు చేసిన మొత్తం? సంబంధిత వివరాలతో కూడిన బిల్లు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఒక్కో లారీకి రూ.1500 నుంచి రూ.5 వేలకు పైగా వసూలు చేస్తుండడంతో శనివారం లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు రూ. 500లోపు ఖర్చయ్యేదని, ఇప్పుడు అధిక మొత్తంలో వసూళ్లు చేసిన బిల్లువ్వడం లేదని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు భూపాల్‌ ఆరోపించారు.

లారీ ఓనర్లకు అదనపు భారం

లారీకి రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు

చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రైవేట్‌ సిబ్బంది

ఆర్థిక భారం వేయొద్దు..

రిప్లెక్లివ్‌ స్టిక్కర్లతో లారీల ఓనర్లకు భారమవుతోంది. లారీకి రూ.1500 నుంచి రూ.5వేలకు పైగా వసూలు చేస్తున్నారు. స్టిక్కర్లకు బిల్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లు వేస్తే లారీలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. భారంగా మారిన క్యూ ఆర్‌ కోడ్‌ స్టిక్కర్లు తొలగించాలి. దీనిపై లారీ ఓనర్ల అసోసియేషన్‌ ద్వారా రవాణాశాఖ మంత్రిని కలిసి సమస్యను విన్నవిస్తాం.

– వేముల భూపాల్‌, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోశాధికారి

ఇబ్బందులు పడుతున్నాం..

క్యూ ఆర్‌ కోడ్‌ స్టిక్కర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వాహనాలకు స్టిక్కర్లు ఉన్నా.. వాటి పై క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లు వేసి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై రవాణాశాఖ అధికారులు స్పందించాలి. భారంగా మారిన రిఫ్లెక్లివ్‌ స్టిక్కర్లను ఫిట్‌నెస్‌తో ముడిపెట్టొద్దు

– ఎండీ జాకీర్‌,

లారీ ఓనర్స్‌ జిల్లా కోశాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement