హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశపుహాల్‌లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభయమ్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ముగిసిన టెన్నిస్ ఇంటర్ క్లబ్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్‌ఎస్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్–రడం శ్రీనివాస్ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, టెన్నిస్ వంటి క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు రవిచంద్ర, సిరికొండ సుదర్శన్, వెంకట్ నారాయణ, డాక్టర్ ప్రేమ్‌రాజ్, డాక్టర్ బిల్లా మహేందర్‌రెడ్డి, డాక్టర్ పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్‌రెడ్డి, కంది మనోహర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకట్, క్రీడాకారులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతే
కాలనీవాసుల లక్ష్యం
కాశిబుగ్గ: ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రొఫెసర్ రతన్‌సింగ్ ఠాకూర్, వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు బండా కాళీదాసు సూచించారు. ఓసిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని పరిశుభ్రత కార్యక్రమాలను ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఆదివారం కాలనీవాసులందరు ముందుకొచ్చి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం అభినందనీయమన్నారు. కాలనీలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి, బస్తాల్లో నింపి మున్సిపల్ సిబ్బంది అందించడం ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బొబ్బాల శ్రీనివాస్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ భీమయ్య, కాలనీ పెద్దలు, జవాన్ ప్రభాకర్, రాజు పాల్గొన్నారు.


