కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ పరిధిలోని రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో అక్రమాలకు పాల్పడిన రైల్వే అధికారులు, కాంట్రాక్ట్ సంస్థపై సీబీఐ కేసు కలకలం సృష్టించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముగ్గురు రైల్వే ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ నిర్వాహకులు, ఒక కాంట్రాక్ట్ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీబీఐ అధికారులు కాజీపేట జంక్షన్ సబ్ డివిజన్ పరిధిలోని రైల్వే కార్యాలయాలకు వెళ్లి విచారణ చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. సీబీఐ అధికారులు విచారణకు వచ్చిన విషయాన్ని రైల్వే పోలీసులను అడుగగా అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. సీబీఐ కేసు నమోదు అవినీతి రైల్వే ఇంజనీరింగ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాజీపేట రైల్వే సబ్‌డివిజన్ పరిధిలో కొంతమంది రైల్వే అధికారుల పనితీరు, విధి నిర్వహణ, కార్మికులను వేధిస్తున్న వారు, రైల్వే ను మోసం చేస్తూ కంభకోణాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. ఇప్పుడు కాజీపేట రైల్వేట్రాక్ నిర్వహణ విధుల్లో అక్రమాలకు పాల్పడిన ఇంజనీర్లు, సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు కావడం, గతంలో కాజీపేట రైల్వేలో నమోదైన రెండు సీబీఐ కేసులు దక్షిణ మధ్య రైల్వేలో సంచలనం రేపుతున్నాయి.
ఐదుగురు ఉద్యోగులు,
కాంట్రాక్టు సంస్థపై నమోదు
ట్రాక్ నిర్వహణలో అక్రమాలే కారణం
సోషల్ మీడియాలో వైరల్


