● చాలీచాలని పరికరాలతో ఇబ్బందులు
● జిల్లా మంత్రులు స్పందించాలని రైతుల వేడుకోలు
దుగ్గొండి: వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతుంది. కూలీల కొరత, పెరిగిన వేతనాలు, అధికమైన పెట్టుబడి వ్యయం, అందని గిట్టుబాటు ధర, రోజురోజుకూ తగ్గుతున్న దిగుబడులు వెరసి అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి కూలీల కొరత నుంచి విముక్తి కలిగించడానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తీసుకువచ్చింది. 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తుంది. రైతులు వేల సంఖ్యలో ఉండి సబ్సిడీ యంత్రాలను పదుల సంఖ్యలో కేటాయించడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,56,926 మంది రైతులు ఉండగా 2,30,277 ఎకరాల సాగు భూమి ఉంది. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, పసుపు పంటలను విరివిగా సాగు చేస్తున్నారు. ఈఏడాది ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించడానికి శ్రీకారం చుట్టింది.
రూ.2కోట్లు విడుదల..
ప్రభుత్వం ఈ ఏడాది సబ్సిడీ పరికరాలు అందించేందుకు రూ.2 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో సబ్సిడీపై 2,548 వ్యవసాయ పరికరాలు మంజూరు చేసింది. అయితే లక్షల్లో ఉన్న రైతులకు వందల్లో పరికరాలు మంజూరు చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలానికి 2 వేల పరికరాల చొప్పున 25 వేల పరికరాలు మంజూరు చేస్తే ఉపయోగకరంగా ఉండేదని అన్నదాతలు అంటున్నారు. ఒక్క దుగ్గొండి మండలంలో 10,465 మంది రైతులు ఉండగా 23,641 ఎకరాల సాగు భూమి ఉంది. మండలానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 129 బ్యాటరీ పంపులు, 27 పవర్ స్ప్రేయర్‌లు, 7 రోటోవీటర్లు, సీడ్‌డ్రిల్ మిషన్ 1, బ్రష్‌కట్టర్లు 2, పవర్ టిల్లర్ 1, గడ్డికట్టలు యంత్రం 1 ఇలా మొత్తం 168 పరికరాలు మాత్రమే మంజూరు చేశారు. కనీసం 2వేల పరికరాలైన ఇస్తే సౌకర్యంగా ఉండేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేయించి రైతులకు అవసరమైన పనిముట్లను అందించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో రైతులు: 1,56,926
సాగు విస్తీర్ణం: 2,30,277 ఎకరాలు
ఇప్పటివరకు అందిన పరికరాలు: 2,548
సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించాలి
గ్రామాల్లో వ్యవసాయం చేసేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. మునుపటిలా కష్టం చేయాలంటే ఈ తరానికి శక్తి సరిపోవడం లేదు. యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తేనే వ్యవసాయం మనుగడ సాగిస్తుంది. రైతులకు అవసరం ఉన్న పవర్‌వీడర్లు, పవర్ టిల్లర్లు, డ్రోన్‌లు, మినీట్రాక్టర్లు, ట్రాక్టర్‌తో నడిచే యంత్ర పరికరాలతో పాటు రైతుకు అవసరమయ్యే ప్రతీ పనిముట్టును 50 శాతం సబ్సిడీతో ఎలాంటి షరతులు లేకుండా అందించాలి.
–లడె మోహన్‌రావు,
రైతు సంఘం జిల్లా నాయకుడు
విడతల వారీగా అందిస్తాం
జిల్లావ్యాప్తంగా రైతులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం నుంచి అందిన నిధులతో వచ్చే పరికరాలను మండలాల వారీగా కేటాయించాం. జిల్లాకు 50వేల పరికరాలు అవసరమని నివేదికలు ఇచ్చాం. నిధులు మంజూరు అయితే విడదల వారీగా అవసరం ఉన్న రైతులకు అందిస్తాం.
–అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి


