‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో కలెక్టర్‌

Mar 4 2026 7:12 AM | Updated on Mar 4 2026 7:12 AM

న్యూశాయంపేట: ఈనెల 6 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్‌ల ఉచిత విద్యుత్‌ తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతీ నెల బిల్లుల చెల్లింపులు ఖచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలన్నారు. 99 రోజుల ప్రోగ్రాంలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగసామ్యం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

నాగేంద్రస్వామికి

వసంతోత్సవ శోభ

గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలి నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో అపురూపమైన, అరుదైన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకుని గర్భాలయంలోని స్వామి వారిని నవ (తొమ్మిది) వర్ణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. హోలీ అంటే దేవతల పండుగ అని, ఆ తర్వాతే మానవులు జరుపుకుంటారని ప్రధాన అర్చకులు సుముద్రాల సుదర్శనాచార్యులు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించారు. అర్చకులు శ్రీహర్ష, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంగమేశ్వర దేవాలయం ద్వారబంధనం

సంగెం: మండల కేంద్రంలోని ప్రసిద్ధ గంగాభవాని సంగమేశ్వరాలయాన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మూసివేసినట్లు ఆలయ అర్చకుడు అప్పె నాగార్జున శర్మ తెలిపారు. మంగళవారం ఉదయం ప్రాతఃకాల నిత్య అభిషేకం, అరిత పూజలను నిర్వహించి గ్రహణం కారణంగా ఉదయం 9 గంటలకు మూసివేసినట్లు తెలిపారు. గ్రహణం అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసి బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం అనుమతి ఉంటుందన్నారు.

రైల్వే శాఖలో

సీబీఐ కేసు కలకలం

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్‌ నిర్వహణ పనుల్లో అక్రమాలకు పాల్పడిన రైల్వే అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థపై సీబీఐ కేసు కలకలం సృష్టించింది. ముగ్గురు రైల్వే ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్‌ నిర్వాహకులు, ఒక కాంట్రాక్ట్‌ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీబీఐ అధికారులు కాజీపేట జంక్షన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని రైల్వే కార్యాలయాలకు వెళ్లి విచారణ చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. సీబీఐ అధికారులు విచారణకు వచ్చిన విషయాన్ని రైల్వే పోలీసు అధికారులను అడుగగా అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. సీబీఐ కేసు నమోదైన విషయం అవినీతి రైల్వే ఇంజనీరింగ్‌ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాజీపేట రైల్వే సబ్‌డివిజన్‌ పరిధిలో కొంతమంది రైల్వే అధికారుల పనితీరు, విధి నిర్వహణ, కార్మికులను వేధిస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement