నర్సంపేట: మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసి జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేటలో కొత్త పాలకవర్గం కొలువు దీరింది. కోఆప్షన్ పదవుల కోసం రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. నర్సంపేటలో 15మంది, వర్ధన్నపేటలో 8మంది ఆశవహులు ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్.నాగరాజు మన్ననల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేసిన సీనియర్ నాయకులకు పదవులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది. గతనెల 11న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం 16న ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టింది. త్వరలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక జరుగనుండడంతో పార్టీ కోసం కష్టపడిన వారు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆశీర్వాదం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ప్రయత్నాలు ముమ్మరం
జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తై కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కాయి. నర్సంపేటలో 30వార్డులు ఉండగా 21వార్డులు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 22మందికి చేరింది. బీజేపీకి ఒకటి, సీపీఎం ఒకటి, బీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లుగా గెలుపొందారు. 12వార్డులు ఉన్న వర్ధన్నపేటలో ఎక్స్‌అఫీషియో ఓటుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నాలుగు చొప్పున కోఆప్షన్ సభ్యులను భర్తీ చేసే అవకాశం ఉండడంతో కసరత్తు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం 45నుంచి 60రోజుల్లో నామినేటెడ్ కింది కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. కోఆప్షన్ సభ్యుల ఎంపిక సమయం సమీపిస్తుండడంతో అధికార పార్టీలో ఉన్న మాజీ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ నాయకులు నామినేటెడ్ పదవులు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆశావహుల ఎదురుచూపులు
నర్సంపేటలో 15మంది, వర్ధన్నపేటలో 8మంది ప్రయత్నాలు
ఎమ్మెల్యేల మన్ననలు పొందేందుకు లాబీయింగ్
ఎంపిక ఇలా..
ప్రభుత్వం కోఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత ఆశావహులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్.నాగరాజు ప్రతిపాదించిన వ్యక్తులకే నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంటుంది. ప్రతీ మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ పదవులు ఉండనుండగా రెండు మైనార్టీలకు, రెండు జనరల్‌కు కేటాయిస్తారు. వాటిలో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కేటాయిస్తారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు ఒక్కటి చొప్పున ఇవ్వనుండగా, జనరల్ కేటగిరీలో కో ఆప్షన్ పదవులు పొందాలంటే గతంలో ఐదేళ్లపాటు ప్రజాప్రతినిధిగా పనిచేసి ఉండాలి. మాజీ కౌన్సిలర్లు లేదా ఇతర పదవుల్లో పనిచేసిన వారినే నామినేటెడ్ పదవుల కింద కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.


