● 257 మంది పోలీసులతో భారీ బందోబస్తు
● 100 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
● ట్రాఫిక్ నియంత్రణకు దారి మళ్లింపు
గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర మంగళవారం (హోలీ పండుగ) ప్రారంభం కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ సోమవారం తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్వర్వుల మేరకు ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో జాతరలో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ఏసీపీలు, 10 మంది ఇన్‌స్పెక్టర్లు, 15 మంది ఎస్సైలు, 230 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. బందోబస్తును పర్యవేక్షించడానికి ఆలయం వద్ద కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాజకీయ ప్రభ వద్ద గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు సీఐ తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు
వరంగల్ – నర్సంపేట రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం రాత్రి వరకు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు సీఐ విశ్వేశ్వర్ వెల్లడించారు. వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్లే వాహనాలను మచ్చాపూర్, పల్లార్ల గూడ, మొండ్రాయి, కొత్తపల్లి, ఉప్పరపల్లి, కోనాపురం, చెన్నారావుపేట మీదుగా నర్సంపేట వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు.


