● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి సాగిస్తున్న వీధి విక్రయదారుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. లబ్ధిదారులకు రుణం మంజూరు , తిరిగి చెల్లింపుల పురోగతి, కొత్త అర్హుల గుర్తింపు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించడం వంటి పలు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ.గణేష్, నర్సంపేట, వర్ధనపేట మున్సిపల్ కమిషనర్లు, లీడ్ బ్యాంకు అధికారులు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి
మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్‌తో పాటు జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు సేవలను కొనియాడారు.
వైద్యసేవలపై నిర్లక్ష్యం తగదు
న్యూశాయంపేట: రోగులకు అందించాల్సిన వైద్యసేవలపై నిర్లక్ష్యం వహించరాదని వైద్యాధికారులను కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా వైద్యాశాఖాధికారి, సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. వైద్యశాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. ఏరియా, జీజీహెచ్, నర్సంపేట, సీకేఎం, ఎంజీఎం, రీజినల్ ఆస్పత్రుల్లో జరిగే అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. ఆయా ఇన్‌స్టిట్యూట్లకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.


