న్యూశాయంపేట: ప్రజలు సమర్పించిన వినతులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. గ్రీవెన్స్‌కు మొత్తం 163 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూకు సంబంధించినవి 67, జీడబ్ల్యూఎంసీ 38, ఇతర శాఖలకు సంబంధించినవి 58 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూశాఖకు సంబంధించిన దరఖాస్తులను ఆయా తహసీల్దార్లకు పంపించి సమస్యలు త్వరితగతిన పరిష్కారమ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో పెండింగ్ ఉన్న గ్రీవెన్స్ దరఖాస్తుల్లో రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, పోలీస్ శాఖలకు సంబంధించినవి అధికంగా ఉన్నాయని అన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, అధికారులు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ


