ప్రజాస్వామ్యానికి ఓటు పునాది
హన్మకొండ అర్బన్: ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బిద్యాధర్ సుబుదీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. ఓటు హక్కు వినియోగంతోనే దేశ నిర్మాణం జరుగుతుందన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలోనూ 2002 ఓటర్ల జాబితాలోని వివరాలను 2025 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువ ఓటర్లు, సీనియర్ ఓటర్లతో పాటు బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, ఏఈఆర్‌ఓలు, ఈఆర్‌ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా విద్యార్థులు, యువత, అధికారులు డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కె.నారాయణ, డీటీఓ శ్రీనివాస్ కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, రెడ్‌క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబర్ ఈవీ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ


