వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు
న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ ఉచిత శిబిరం కేవలం ఒక కార్యక్రమం కాదని, తమ ఇంట్లో ఉన్న వృద్ధులకు తామిచ్చే భరోసా అని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన న్యాయ సహాయాన్ని సకాలంలో అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ పాల్గొన్నారు.


