ఎస్టీలు లేకున్నా రిజర్వేషన్
వంజరపల్లి గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ కేటాయింపులో అధికారుల తప్పిదం
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ అధికారులు చేసిన తప్పిదంతో ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికే లేకుండా పోయింది. అన్ని పల్లెల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగి గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌లను ఎన్నుకుంటే, ఇక్కడ మాత్రం పంచాయతీ పైఅధికారుల నిర్లక్ష్యంతో గ్రామ సారధిని ఎన్నుకోలేకపోయారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎన్నికలు జరిగాయని అధికారులు చెబుతున్నా.. 2018లోనూ అప్పటి ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం 500 జనాభాకు మించి ఉన్న గ్రామాలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి అప్పుడూ జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. దీని ప్రకారమే వంజరపల్లిలో భాగమైన ఎస్టీ జనాభా ఉండే రేఖ్యానాయక్ తండా (212 మంది ఎస్టీ ఓటర్లు) విడిపోయి పోచమ్మ తండాలో కలిసింది. ఈ మేరకు వంజరపల్లిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో ఎన్నికలు జరిగాయి. రేఖ్యానాయక్ తండా కలిసిన పోచమ్మ తండాలో ఎస్టీ మహిళ రిజర్వ్ అయి ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు కూడా పోచమ్మ తండాలో మళ్లీ ఎస్టీ జనరల్ రిజర్వ్ కాగా, వంజరపల్లిలో మాత్రం ఒక్క ఎస్టీ లేకున్నా కూడా సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. పనిలో పనిగా మూడు వార్డులు కూడా ఎస్టీకి అధికారులు రిజర్వ్ చేయడం చర్చనీయాంశమైంది. మిగిలిన ఐదు వార్డులకు ఎన్నికలు జరగగా, ఉపసర్పంచ్‌గా మోర్తాల చందర్‌రావు ఎన్నికయ్యారు.
ముమ్మాటికి అధికారుల తప్పిదమే..
● 2011 జనాభా లెక్కల ప్రకారం వంజరపల్లిలో 212 మంది ఎస్టీలు, 56 మంది ఎస్సీలు, 270 మంది బీసీలు మొత్తం 538 మంది జనాభా ఉంటే 438 మంది ఓటర్లున్నారు. అప్పుడూ రేఖ్యానాయక్ తండా కూడా వంజరపల్లిలోనే ఉంది. అయితే 2018లో అప్పటి ప్రభుత్వం 500 జనాభాకు మించిన గ్రామాలు, తండాలను పంచాయతీలుగా మార్చడంతో 212 మంది ఎస్టీ జనాభా ఉన్న రేఖ్యానాయక్ తండాతో పాటు జారబండా తండా, బోరింగ్ తండా, మహారాజు తండాలు కూడా పోచమ్మ తండాలో విలీనమయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 561 మంది ఎస్టీలుండగా, 2018లో ఇతర తండాలు కలవడంతో ఓటర్ల సంఖ్య 860కు చేరుకుంది. అలాగే, వంగరపల్లిలో ఉన్న 373 మంది ఓటర్లు (324 మంది బీసీలు, 49 మంది ఎస్సీలు) ఉండడంతో 2018లో బీసీ మహిళ రిజర్వేషన్‌తో ఎన్నికలు జరిగాయి.
● 2018లో వంజరపల్లి గ్రామం సర్పంచ్ స్థానం మాత్రం బీసీ మహిళకు రిజర్వ్ కాగా, ఈసారి ఎస్టీ జనరల్‌కు అధికారులు కేటాయించారు. ఇక్కడా ఎస్టీ జనాభా లేదని, బీసీ, ఎస్సీలే ఉన్నారని 373 మంది ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు జిల్లా అధికారులకు సమర్పించినా ఎస్టీ జనరల్‌కు సర్పంచ్ స్థానం, మూడు వార్డులు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అదే వంజరపల్లి గ్రామం నుంచి రేఖ్యానాయక్ తండా వెళ్లి కలిసిన పోచమ్మ తండాలో మాత్రం 2018లో మాదిరి గానే 860 ఓటర్లతో ఈసారి ఎన్నికలు జరిగాయి. రేఖ్యానాయక్ తండావాసులు మాలోతు రాజుకుమార్, బానోతు శ్రీదేవి వార్డు సభ్యులుగా కూడా ఎన్నికయ్యారు. దీన్నిబట్టి చూస్తే పోచమ్మ తండాకు న్యాయం జరిగితే, వంగరపల్లికి అన్యాయం జరగడమేంటని ఇప్పటికే కలెక్టర్లు, పంచాయతీ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్తులు హైకోర్టుకు వెళ్లారు. అయితే డ్రా తీసే సమయంలో వంజరపల్లికి ఎస్టీ జనరల్ వస్తే, అక్కడా బీసీ, ఎస్సీ ఓటర్లే ఉన్నారు కదా అని అధికారులు అప్రమత్తమై ఉంటే ఈ అన్యాయం జరిగి ఉండేది కాదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికా రులపై చర్యలు తీసుకోవాలంటున్నారు.
ఈ ఊరి నుంచి ఎస్టీ జనాభా వెళ్లి కలిసిన పోచమ్మ తండాకు వాస్తవ రిజర్వేషన్
2018లో మాదిరిగానే 860 ఓట్లతో పోచమ్మ తండాలో సర్పంచ్ ఎన్నికలు
అలాంటప్పుడూ ఇక్కడా ఎస్టీ జనాభా లేదని తెలిసి మరీ రిజర్వేషన్
అధికారుల నిర్లక్ష్యంతోనే
వంజరపల్లికి అన్యాయమనే చర్చ
ఇప్పటికై నా తప్పు సరిదిద్దుకొని ఎన్నికలు నిర్వహించాలంటున్న గ్రామస్తులు
అధికారుల తప్పిదమే..
2018లో వంజరపల్లి, రేఖ్యానాయక్ తండా కలిసిన పోచమ్మ తండాలో బీసీ మహిళ, ఎస్టీ మహిళ అభ్యర్థులుగా పోటీచేశారు. కిందిస్థాయి అధికారులు వంజరపల్లిలో బీసీలు, ఎస్సీలే ఉన్నారంటూ ఓటరు జాబితాను సమర్పించినా కూడా పైస్థాయి అధికారుల తప్పిదంతో మా ఊరికి అన్యాయం జరిగింది. అదే పోచమ్మతండాకు మాత్రం ఆ ఊరులో కలిసిన రేఖ్యానాయక్ తండా, ఇతర తండాలతో ఓటర్లను కలుపుకొని ఈసారి ఎన్నికలు నిర్వహించారు. 2018లో మాదిరిగానే రేఖ్యానాయక్ తండా రెండు వార్డులు, మహారాజు తండా రెండు వార్డులు, పోచమ్మ తండా రెండు వార్డులు, జారుడు తండా ఒకటి, బోరింగ్ తండా ఒకటి వార్డులకు ఎన్నికలయ్యాయి. దీన్నిబట్టి చూస్తే జిల్లా ఉన్నతాధికారుల తప్పిదం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికై నా 2018లో మాదిరిగానే ఇక్కడా జనాభా ఉన్న రిజర్వేషన్ కలిపించి ఎన్నిక నిర్వహించాలి.
– సోమిడి శ్రీనివాస్, వంజరపల్లి
ఎస్టీలు లేకున్నా రిజర్వేషన్
ఎస్టీలు లేకున్నా రిజర్వేషన్


