సమస్యలెన్నో.. పరిష్కరించండి
ఐనవోలు: ఐనవోలు మల్లన్న జాతర జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో జాతర నిర్వహణపై శనివారం కలెక్టరేట్‌లో వివిధ అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతులు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
నిధులు లేక నిలిచిన డార్మెటరీ పనులు
మల్లన్న ఆలయంలో కమ్యూనిటీ హాల్ కం డార్మెటరీ హాల్ నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) గతంలోనే ఆమోదం తెలిపింది. బేస్మెంట్ వరకు పనులు చేసి నిధులు మంజూరు కాకపోవడంతో నిలిపేశారు. అర్ధంతరంగా నిలిచిన పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనకే పరిమితమైంది. నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు చేయడంతోపాటు గతంలో ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ టవర్స్ రిపేర్ చేయించాల్సి ఉంది.
భక్తుల డిమాండ్లు
● ఆలయ ప్రాంగణంలో పట్నాలు, ఇతరత్రా ఆర్జిత సేవల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక లైన్ ద్వారా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించాలి.
● సేవా టికెట్ కొనుక్కున్న భక్తుల నుంచి ఒగ్గు పూజారులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడాన్ని నియంత్రించాలి.
● భక్తుల సంఖ్యకు సరిపోయేలా సులభ్ కాంప్లెక్స్‌లు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి.
● భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి గదులు, పెద్ద డార్మెటరీ హాల్ నిర్మించాలి.
● ఆలయానికి కనీసం రూ.50 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలి.
● ఆలయ తూర్పు, దక్షిణం వైపు ఉన్న కీర్తితోరణాలు శిథిలం కాగా మరమ్మతులు చేపట్టాలి.
● ఆర్కియాలజీ శాఖ సహకారంతో పడమర వైపు నాలుగో కీర్తి తోరణం ఏర్పాటు చేయాలి. – ఆలయానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా పేరిణి నృత్య మండపాన్ని ఆధునికీకరించాలి.
● రాజగోపురం, కోనేరు ఏర్పాటు, అలాగే ఆలయం చుట్టూ ఉన్న నేల బయ్యారాన్ని నిపుణుల సాయంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి.
● పూర్వం ఊరగుట్టపైనే మల్లికార్జునస్వామి వెలిశాడని ఐనవోలువాసుల నమ్మకం. ఇటీవల ఊరగుట్టపై ఆలయం తరఫున కార్తీక మాసంలో అఖండ దీపం వెలిగిస్తున్నారు. ఊర గుట్ట, కింద ఉన్న చెరువును అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి.
● జాతర ప్రాంగణంలో 10 స్నాన ఘట్టాలు ఉండగా.. సీ్త్రల డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.
● గత జాతరలో నీటి సరఫరాలో ఇబ్బందులు పడిన కారణంగా 10 హెచ్‌పీ మోటార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
● 40 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, రెండు అదనపు హైమాస్ట్ లైటింగ్ టవర్స్, భద్రతాపరంగా మరో 50 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అగ్నిమాపక వాహనం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి.
● ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలీస్ స్టేషన్‌ను మరో చోటకు మార్చాలి. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో పోలీసులు పట్టుకున్న, యాక్సిడెంట్ ఘటనలకు సంబంధించిన వాహనాలను ఉంచడంతో భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వెంటనే మరో చోటుకు తరలించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఈఓ కందుల సుధాకర్ కోరుతున్నారు.
ఈసారి కలెక్టరేట్‌లో సమావేశం
ప్రతీ ఏడాది జాతరకు సంబంధించిన సమన్వయ సమావేశం మల్లన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహించేవారు. కానీ, ఈసారి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. మల్లన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తేనే అధికారులకు క్షేత్రస్థాయిలో సమస్యలపై, చేయాల్సిన పనులపై పూర్తి అవగాహన ఉంటుందని.. అప్పటికప్పుడు మెరుగైన వసతుల కల్పనకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేడు ఐనవోలు జాతర నిర్వహణపై సమావేశం
కలెక్టరేట్‌లో అధికారులతో
చర్చించనున్న కలెక్టర్
అభివృద్ధిపై
దృష్టిసారించాలంటున్న భక్తులు


