చలితో విలవిల
సాక్షి, వరంగల్/హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల నుంచి ఏకంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి.
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
రాత్రి ఉష్ణోగ్రత మరీ తక్కువగా నమోదవుతున్నది. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు ఆటోమేటిక్ వెథర్ స్టేషన్‌లో నమోదైన వివరాల మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.3 సెల్సీయస్ డిగ్రీలు, అత్యధిక ఉష్ణోగ్రత 32 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదైంది. అయింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.3 డిగ్రీలుండగా అత్యధిక ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలుగా నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.8 సెల్సియస్ డిగ్రీలు, అత్యధిక ఉష్ణోగ్రత 30.6 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఉన్ని దుస్తులకు డిమాండ్..
చలి రోజురోజుకు పెరుగుతుండడంతో మార్కెట్‌లో స్వెటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ఉన్ని దుస్తులు లేనిదే బయటకు రావడం లేదు. మఫ్లర్లు కూడా వాడుతున్నారు. చెవిలోకి చల్లటి గాలి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నడక కోసం పార్కులకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి..
తెల్లవారుజామునుంచే పొగమంచు కురుస్తుండడంతో నిత్యావసర సరుకులైన కూరగాయలు, ఇతర సామగ్రి తీసుకెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ సమయాల్లోనే ఎదురుగా ఉండే వాహనం, ఎదురుగా వచ్చే వాహనం పొగమంచు కారణంగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశముందని, గతేడాది డిసెంబర్‌లోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహనాల పార్కింగ్ లైట్లు వేసుకోవాలన్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్‌ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలకు బ్రోన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. దీనివల్ల ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో బయట ఆహారం తినడం మానేయాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్ సాంబశివరావు,
వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి
జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు (డిగ్రీలు సెల్సియస్‌లలో)
ప్రాంతం అత్యల్పం అత్యధికం
ఎల్కతుర్తి 10.3 29.6
మరిపల్లి గూడెం 11.2 30.3
ఆత్మకూరు 10.8 28.9
నాగారం 11.3 29.9
పెద్ద పెండ్యాల 11.0 32.8
శాయంపేట 11.6 28.9
వేలేరు 11.3 29.6
నడికూడ 12.1 29.6
ధర్మసాగర్ 10.8 31.3
మడికొండ 11.1 30.6
పులుకుర్తి 12.2 30.8
కాజీపేట 11.1 32.3
చింతగట్టు 11.8 32.6
కొండపర్తి 11.1 30.2
భీమదేవరపల్లి 12.8 31.1
పరకాల 13.1 29.5
దామెర 11.5 30.1
ఐనవోలు 12.4 32.4
హనుమకొండ 12.7 30.8
కమలాపూర్ 13.5 32.1
రోజురోజుకూ ఉష్ణోగ్రతల
తగ్గుముఖంతో వణుకుతున్న ప్రజలు
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో
10 నుంచి 11 డిగ్రీలు
నేడు చలి తీవ్రత మరింత
పెరుగుతుందన్న వాతావరణశాఖ
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు
చలితో విలవిల


