ఆయిల్‌పామ్‌పై అవగాహన కల్పించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: ఆయిల్‌పామ్ సాగులో నిర్దేశించిన ప్రగతిని సకాలంలో పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాకు కేటాయించిన 4,250 ఎకరాల లక్ష్యాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రతి క్లస్టర్‌లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి తనకు నిర్దేశించిన 35 ఎకరాల లక్ష్యాన్ని సాధించాలన్నారు.
యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి..
రైతులకు ఎరువులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22 నుంచి యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. పట్టాదారులు పాస్‌బుక్ హోల్డర్లు తమ పట్టాదారు పాస్‌బుక్ నంబర్‌తో నేరుగా లాగిన్ కావాలని, పట్టాలేని రైతులు ఆధార్‌కార్డుతో రిజిస్టర్ కావాలని సూచించారు. మండల క్లస్టర్‌స్థాయి వ్యవసాయ అధికారులు యాప్ వినియోగంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు, ఆయిల్‌పామ్ కంపెనీ జనరల్ మేనేజర్ సతీశ్ నారాయణ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఉద్యాన అఽధికారులు, విస్తరణ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.


